How To Reduce Cough Naturally :దగ్గును మనమందరం ఓ సమస్యగా భావిస్తుంటాం. కానీ, వాస్తవానికి దగ్గు అనేది మన శరీరానికి సంబంధించి కీలకమైన రక్షణ ఏర్పాటని నిపుణులు చెబుతున్నారు. హానికర పదార్థాలు, రేణువులు, సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్తుంటే బయటకు నెట్టేస్తుందని చెబుతున్నారు. అలాగే మన శ్వాస వ్యవస్థలో తయారయ్యే తెమడ, స్రవాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే.. ఒకటి రెండు రోజులు దగ్గు వేధిస్తుంటే జ్వరం, ఫ్లూ, ఇన్ఫెక్షన్గా భావించాలని సూచిస్తున్నారు. వారం రోజులు గడిస్తే బ్రాంకోటైస్, ఎలర్జీ సమస్యగా అనుమానించాలని.. దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
"దగ్గు అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో సమస్య, ఎసిడిటీ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. దీంతో పాటు ఆస్తమా, టీబీ, న్యూమోనియా, ఐఎల్టీ వ్యాధులు ఉన్నవారిలో కూడా దగ్గు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా గొంతు ఇన్ఫెక్షన్, సైనసైటిస్ ఉన్నావారికి కూడా వస్తుంది. కేవలం దగ్గు తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో కాకుండా అసలు ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. అందుకు గల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఊపిరితిత్తులో సమస్య, ఆస్తమా వ్యాధి ఉన్నవారిలో పిల్లికూతలు వచ్చేముందు దగ్గు వస్తుంది. ఇదే కాకుండా టీబీలో కూడా రెండు వారాలు దగ్గుతూ ఉంటే ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దగ్గుతో పాటు తెమడ కూడా వస్తే ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా భావించాలి."
-డాక్టర్ తపస్వి కృష్ణ, పల్మనాలజిస్ట్
ఎడతెరిపి లేకుండా ఎవరికైనా దగ్గు వస్తుందంటే శరీరం ఏదో తీవ్రమైన అనారోగ్యం రాబోతున్నట్లుగా సూచనగా భావించాలంటున్నారు. నాడీ వ్యవస్థ శ్వాసకోశాలను ప్రకోపించడం వల్ల కూడా దగ్గు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు, రసాయనాలు, ఎలర్జీలు, చల్లగాలి, దుమ్ముధూళి, యంత్రాలు పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము వంటివి దగ్గుకు కారణమవుతాయి. కొందరిలో మానసికపరమైన కారణాలు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారిలో కూడా దగ్గు వేధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో నిద్రాభంగం కాకుండా దగ్గు మందులు వాడితే మంచిదని తెలిపారు. చిన్నపిల్లల్లో దగ్గు సాధారణంగా కనిపిస్తుంది. వీరికి తేనె ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుంది. హైబీపీ వంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు దగ్గు విపరీతంగా వేధిస్తుంది.
"తినడానికి ముందు వేడి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. యాంటీ బయాటిక్స్ వాడకంతోపాటు బీటాడిన్తో పుక్కిలించాలి. ఆస్తమా వ్యాధి ఉన్నవారు ఇన్హేలర్ సరిగ్గా వాడుకోవాలి. ఎసిడిటీ ఎక్కువైనప్పుడు కూడా దగ్గు వస్తుంది. నిమోనియా, టీబీలో వచ్చే దగ్గుకు మూడు వారాల పాటు జ్వరం, దగ్గు కలిసి వస్తుంటాయి. ఆ తర్వాత మెల్లగా వాటంతంటవే తగ్గిపోతాయి. గొంతు నొప్పి, సైనసైటిస్‌తో వచ్చే దగ్గుకు కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టడం మంచిది. ఇదే కాకుండా తులసి, అల్లం వాడినా దగ్గు ఈజీగా తగ్గిపోతుంది. బ్యాక్టీరియాతో వచ్చే దగ్గును తగ్గించేందుకు యాంటీ బయాటిక్స్ వాడాలి దగ్గును తగ్గిచడం కన్నా అందుకు గల కారణాన్ని కనుక్కొని పరిష్కరించడమే శ్రేయస్కరం."