Aquatic Foods Good for Heart Health :గుండె మన బాడీలో అతి ముఖ్యమైన భాగం. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, మారిన జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన వ్యాయామం, విశ్రాంతితో పాటు గుండెకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలోనే చాలా మంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చేపలను ఎక్కువగా తీసుకుంటుంటారు. నిజానికి చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా అందులో ఉండే ఒమేగా-3 కొవ్వులు, ఇతర పోషకాలు హార్ట్‌కి ఎంతో మేలు చేస్తాయి. అయితే, చేపలు అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి అయినా పెద్ద వాటి కంటే చిన్న చేపలు తినడంగుండె ఆరోగ్యానికిఎక్కువ మేలు చేస్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకు చిన్న చేపలు మేలు? దీనిపై పరిశోధకులు ఏం చెబుతున్నారు? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
వాస్తవానికి అన్ని రకాల చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్ పేరుకొనిపోకుండా చూస్తుంటాయి. ఈ క్రమంలోనే మీ డైలీ డైట్లో సీ ఫుడ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే పెద్ద వాటి కంటే ఆహార గొలుసు తక్కువగా ఉండే చిన్న చేపలను చేర్చుకోవడం మంచిదంటున్నారు Harvard T.H. Chan School of Public Healthలో న్యూట్రిషన్ అండ్ ప్లానెటరీ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ గోల్డెన్. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిన్న చేపలే ఎందుకంటే?
హెరింగ్, సార్డినెస్, ఆంకోవీస్, మాకేరెల్ వంటి అన్నీ రకాల చిన్న చేపలలో ప్రొటీన్స్ మాత్రమే కాకుండా ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైనఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని చిన్న ఎముకలతో సహా తింటారు కాబట్టి వీటిలో ఉండే కాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా అందుతుందంటున్నారు క్రిస్టోఫర్ గోల్డెన్. అన్నింటికంటే ముఖ్యంగా ట్యూనా, స్వోర్డ్ ఫిష్ వంటి పెద్ద జాతుల చేపలతో పోలిస్తే.. చిన్న చేపలు పాదరసం, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్(PCBs) వంటి కలుషితాలను కలిగి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, మెర్క్యూరీ ఎక్కువగా ఉండే చేపలు మహిళలు, చిన్నారులకు హాని కలిగిస్తాయి. అందుకే.. పెద్ద వాటి కంటే చిన్న చేపలు ఆహారంగా తీసుకుంటే మంచిదంటున్నారు.