INFECTIONS WITH SANITARY PADS : తినే ఆహార పదార్థాలకు, వాడే వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీలను మనం ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలిస్తాం. మరి, నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్‌కు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. కానీ, ఈ నిర్లక్ష్యమే జననేంద్రియ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది తీవ్రమైతే ప్రత్యుత్పత్తి సమస్యలకూ కారణమవుతుందని, ఈ అనారోగ్య సమస్యలు భాగస్వామికి కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి, ఈ నేపథ్యంలో శానిటరీ ప్రొడక్ట్స్ గడువు గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఇవి చూడాల్సిందే :
రుతుక్రమంలో మహిళల కోసం పలు రకాల శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. న్యాప్‌కిన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, ట్యాంపన్స్, డిస్క్‌లు వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిని కొనేటప్పుడు ఆయా ప్యాకెట్లపై ఉండే ప్యాకింగ్, ఎక్స్‌పైరీ తేదీల్ని చాలా మంది పట్టించుకోరు. కొందరు సహజంగా ఉండే నిర్లక్ష్యం కారణంగా పట్టించుకోరు. మరికొందరు ఇవి శరీరానికి బయటి నుంచి వాడే ప్రొడక్ట్స్ కాబట్టి, వాటితో వచ్చే ప్రమాదమేమీ ఉండదని భావిస్తారు. కానీ, అన్ని వస్తువుల మాదిరిగానే వీటి ఎక్స్‌పైరీ డైట్ ను కూడా తప్పకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి మరిచిపోకండి :
శానిటరీ న్యాప్‌కిన్ ప్యాకెట్లపై తయారీ తేదీ రాసి ఉంటుంది. దాని కిందనే ఎప్పటి వరకు దాన్ని వాడుకోవచ్చు అనేది కూడా రాసి ఉంటుంది. ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ గడువు దాటి ఉంటే వాటిని కొనుగోలు చేయకూడదు. కొత్తగా తయారైన న్యాప్‌కిన్స్ కొనుగోలు చేసుకుంటేనే మంచిది.
ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌తో తయారుచేసిన ట్యాంపన్లను ఎక్కువ కాలం వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి నిల్వ ఉంచిన ట్యాంపన్లను అస్సలే ఉపయోగించకూడదని చెబుతున్నారు. అవి, చూడటానికి తాజాగా కనిపించినా, వాటిపై సూక్ష్మ బ్యాక్టీరియా ఉంటుందని, వైరస్‌లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల వీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ పరిశీలించడం మర్చిపోవద్దని చెబుతున్నారు.
ఇక, మెన్‌స్ట్రువల్ కప్స్ గురించి చూస్తే అవి చాలా సార్లు తిరిగి ఉపయోగించేలా తయారు చేస్తారు. అయితే, వీటి క్వాలిటీ మనం అనుసరించే పరిశుభ్రతను మీద వినియోగ కాలం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, వినియోగించే ముందు వీటి లేబుల్‌ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఇన్ఫెక్షన్ల ముప్పు :
ప్యాకెట్ కొత్తగా కనిపించినప్పటికీ, సంవత్సరాల తరబడి అవి మూలకు పడి ఉంటే వాటిపై బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాడ్స్ ఉపయోగిస్తే జననేంద్రియాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఆ భాగంలో ఎర్రటి దద్దుర్లు, దురద, మంట వంటివి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల నిర్లక్ష్యంగా ఉండి ఈ సమస్యలు తెచ్చుకోవద్దని, కొనేటప్పుడే గడువు తేదీని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.