Midday Meal In Govt Juniors Colleges : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమలు చేయనున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దీంట్లో సుమారు 1.70 లక్షల మంది చదువుతున్నారు.
మధ్యాహ్న భోజన పథకం : కళాశాలలన్నీ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దీంతో మార్నింగ్ తొందరగా బయలుదేరడంతో భోజనం తెచ్చుకునే సమయం ఉండట్లేదు. ఈ సమస్య వల్ల విద్యార్థులు మధ్యాహ్నమే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. విద్యార్థుల హాజరుశాతం కూడా తగ్గుతుంది. ఈ సమస్యల నివారించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ఏర్పాటు చేయనుంది.
ఒక్కో విద్యార్థికి పూటకు రూ.20 నుంచి రూ.25 ఖర్చు : దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తానని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ పధకానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగానే వారం రోజుల్లో ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సమర్పించనుంది. ఒక్కో విద్యార్థిపై పూటకు రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చవుతుంది. ఏటా రూ.100 నుంచి 120 కోట్లు అవసరమవుతాయని ప్రాధమిక అంచనా.
గతంలో రెండు సార్లు అమలు చేసి : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని 2018లో గత ప్రభుత్వం నిర్ణయించింది. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అమలు చేయాలని ఆనాడు కమిటీ సూచించింది. ఈ మేరకు 2018-19 విద్యా సంవత్సరంలో ఆగష్టు 15న పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నా అమలుకాలేదు.
మరోసారి 2020-21 విద్యా సంవత్సరంలో అమలు చేయాలని 2020 జూలై 17న ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశించినా అది అమలు కాలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని ఎలాగైనా అమలు చేయాని ఇప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏపీలో ఇటీవలె మధ్యాహ్న బోజన పథకానికి శ్రీకారం చుట్టారు. కళాశాలల సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వండి సరఫరా చేస్తున్నారు.
అందరికీ ఆదర్శం - మెట్పల్లి జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందం
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ - రుచికరంగా ఉందని ప్రశంస