Alaknanda Hospital kidney racket case : ఆర్గాన్ రాకెట్‌కు సంబంధించి అందరిని కలవరపాటుకు గురిచేసిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్ధిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు బరిగితెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగు చూసింది. దాదాపు 5 గంటలకు పైగా బాధితులతో మాట్లాడిన అనంతరం డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్టు సమాచారం.
విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి : హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీమార్పిడి ఘటన అవయవదాన వ్యవస్థలోని లోపాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆస్పత్రులపై ప్రభుత్వ నిఘా డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. కేవలం ఆర్నెళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఒకేరోజు ఏకంగా ఇద్దరు రోగులకు ఎలాంటి అనుమతి లేకుండానే కిడ్నీమార్పిడి చేయడం అందుకు నిదర్శనం.
కిడ్నీలను దానం చేసిన మహిళలిద్దరూ ఒంటరి వారుకావడం వారి ఆర్ధిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు వారిని ఈ రొంపిలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
రూ.50లక్షల ప్యాకేజి మాట్లాడుకున్న దళారులు : ఈనెల16 న ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. దాతలిద్దరూ తమిళనాడుకు చెందిన వారుకాగా గ్రహీతలు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. సేకరించిన కిడ్నీలను 67 ఏళ్ల వృద్దుడు, మరో 48ఏళ్ల మహిళకు అమర్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే కిడ్నీ దాతలు, గ్రహీతలకు ఒకరితో ఒకరికి అసలు ఏ సంబంధం లేదని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
అవయవాలు తీసుకున్న వారినుంచిదళారులు 50లక్షల ప్యాకేజి మాట్లాడుకున్నట్లు సమాచారం. అందులో 40 లక్షలు వైద్య ప్యాకేజికాగా 10 లక్షలు కమిషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నీదాతలకు 4 లక్షల చొప్పున ఇప్పిస్తామని నమ్మించి 50 వేల చొప్పున కమిషన్ చెల్లించాలని బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలిచ్చేందుకు బాధితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతి లేకుండా ఇంత పెద్ద శస్త్రచికిత్సలు ఎవరు చేశారు? ఇక్కడే నిర్వహించారా? ఇంకెక్కడైనా చేస్తున్నారా అనే కోణంలో నిజనిర్ధారణ కమిటీ దృష్టి సారించింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో చేతులు మారిన డబ్బు సహా మరిన్ని కీలక అంశాలు ప్రాథమికనివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.