Caffeine Side Effects : వేడి వేడిగా ఉండే కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. ఇదంతా కాఫీలోని కెఫిన్ మహాత్మ్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అలాగని అధికంగా తీసుకుంటే మాత్రం వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆందోళన : కాఫీ, టీ వంటివి (కెఫిన్) ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో చికాకు, ఆందోళన, భయము, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లో కూడా ఇదే విషయం వెల్లడైంది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నిద్రలేమి : రోజూ ఎక్కువగా కెఫిన్ ఉండే పానీయాలు తాగడం వల్ల మనం కంటి నిండా నిద్రకు దూరమయ్యే అవకాశం ఉందంటున్నారు. 2013లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్' లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగిన వారిలో నిద్రలేమి సమస్య వచ్చే ఛాన్స్ 40 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు పరిశోధకులు.
జీర్ణ సమస్యలు : కెఫిన్ ఉండే కాఫీ, ఇతర పానీయాలను అధికంగా తీసుకోవడం జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కొందరిలో ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల గుండెలో మంట, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే, మరికొందరిలో ఎక్కువ మోతాదులో కాఫీ తాగడం విరేచనాలకు దారితీసే అవకాశం లేకపోలేదంటున్నారు.
వీళ్లు సాయంత్రం పూట కాఫీ తాగొద్దట! - కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా..?
అధిక రక్తపోటు : నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటును పెంచుతుందట. ముఖ్యంగా ఇప్పటికే బీపీ సమస్యతో బాధపడేవారిలో ఈ సమస్య మరింత తీవ్రతరం కావొచ్చు.
గుండె దడ : రోజూ అధిక మొత్తంలో కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్ శాతం పెరుగుతుంది. దీనివల్ల గుండె దడ, హృదయ స్పందన రేటులో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.
అతి మూత్రవిసర్జన : కెఫిన్ ఉండే కాఫీ లేదా టీ రోజూ ఎక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందంటున్నారు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ గురవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లో కూడా అధిక కెఫిన్ వినియోగం ఓవర్ యాక్టివ్ బ్లాడర్(ఓఏబీ) వంటి మూత్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకా కెఫిన్ ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు ఎక్కువగా తాగితే భవిష్యత్తులో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అందుకే కాఫీని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.