Which is Better Between Sitting And Standing :ప్రస్తుత కాలంలో కొంత మంది టైమ్ లేదనే కారణంతో నిలబడి గబగబా భోజనం తినేస్తుంటారు. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా నిల్చునే తింటారు. ఇంకా.. పానీ పూరీ మొదలు చిరు తిళ్లు ఏవైనా చాలా వరకు నిల్చుని తింటారు. అయితే.. ఇలా భోజనం చేయడం వల్ల కొన్ని సమస్యలువస్తాయని నిపుణులంటున్నారు. పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
నిలబడి భోజనం చేస్తే :
కూర్చుని భోజనం చేసిన వారికంటే.. నిలబడి తినేవారు ఎక్కువగాఆహారం తింటారట. గురుత్వాకర్షణ వల్ల పొట్టలోని ఆహారం వేగంగా పేగుల్లో కదిలినట్లు పరిశోధనలో తేలిందట. దీంతో నిలబడి భోజనం చేసేవారు వారికి తెలియకుండానే ఎక్కువగా తినే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. 2012లో "జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నిలబడి భోజనం చేసేవారు, కూర్చుని భోజనం చేసిన వారికంటే ఎక్కువగా ఆహారం తిన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ బ్రయాన్ వాన్ వెస్టెన్‌డోర్ప్' పాల్గొన్నారు. నిలబడి భోజనం చేసేవారు ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే నిల్చుని భోజనం చేయడం వల్ల కొంత మందిలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందట!
టేస్టీగా అనిపించదు!
నిలబడి తినడం వల్ల తిండిపై పూర్తిగా దృష్టిపెట్టే ఛాన్స్ ఉండదట. దీంతో.. ఆహారం టేస్టీగా ఉన్నకూడా దాని రుచిని పూర్తిగా ఆస్వాదించలేరట. ఎందుకంటే.. నిలబడి తింటున్నప్పుడు నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయట. ఇంకా.. నిలబడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన కొవ్వులు, పోషకాల వంటి సక్రమంగా అందవని తేల్చారు.