How to Treat Squint in Child : మెల్లకన్ను చాలా మందికి ఉంటుంది. అయితే పిల్లలకు మెల్లకన్ను ఉంటే కొద్దిమంది తల్లిదండ్రులు అదృష్టం అని భావిస్తే.. మరికొద్ది మంది మాత్రం ఆందోళన చెందుతుంటారు. తమకు ఈ సమస్య లేకపోయినా.. తమ చిన్నారులకు వచ్చిందని దిగులు పడుతుంటారు. మెల్లకన్ను ఉండి చూపు బాగానే ఉన్నా సరే.. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అనే కోణంలో ఆలోచించి బాధపడుతుంటారు. మరి.. మెల్లకన్నును సరిచేయవచ్చా? దీనికి నిపుణుల సమాధానం ఏంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కళ్ల వెనుక జరిగేది ఇదే: మనిషికి కళ్లు కెమెరాలుగా పనిచేస్తాయి. కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ.. రెండూ ఒక దిశవైపు కదులుతూ ఒకే విజువల్ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. ఆ దృశ్యాలు మనకు తెలిసేలా మెదడు సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. రెండు కనుగుడ్లూ సమన్వయంతో చూసేందుకు కంటి వెనక ఆరు కండరాలు పని చేస్తాయి. అయితే.. ఈ కండరాల్లో సమస్య వచ్చి, రెండు కనుగుడ్లలో సమన్వయం లోపించినపుడు ఒక్కొక్కటీ ఒకవైపు చూస్తుంది. దాన్నే మెల్లకన్నుగా పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనంగా ఉండడం వల్లనో, డెవలప్‌మెంట్‌లో లోపం వల్లనో మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి చెబుతున్నారు. పిల్లలకు ఈ సమస్య రావడానికి తల్లిదండ్రుల్లోనూ మెల్లకన్ను ఉండక్కర్లేదంటున్నారు. అలాగే మెల్లకన్ను ఉండి చూపు బాగానే ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని.. ముందు కంటి డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్యులు పరీక్షించి ఎందుకు వచ్చిందో చెబుతారని.. కొన్నిసార్లు మెదడులో కణితులున్నా ఈ సమస్యలు వస్తాయంటున్నారు. సమస్య తీవ్రతను బట్టి మందులు, కళ్లద్దాలు వాడొచ్చా? ఆపరేషన్ అవసరం ఏమైనా ఉందా? వ్యాయామాలతో సరిపోతుందా? అన్నది పరీక్షించి చెబుతారని సూచిస్తున్నారు.
మానసిక ఇబ్బందులు కూడా: మెల్లకన్ను సమస్య ఉన్నవారు.. తోటి వారిని చూసి ఆత్మన్యూనతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. సున్నితమనసు కలిగిన వారైతే ఆందోళన, కుంగుబాటుకీ గురవుతుంటారని అంటున్నారు. కాబట్టి, ఊహతెలిసినప్పటినుంచీ వారిలోని మంచి గుణాలు ఏంటో తెలిసేలా చేయమంటున్నారు. ముఖ్యంగా తనముందు తరచూ ఈ సమస్య గురించి చర్చించవద్దని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి
అందంగా కనిపించాలని "కాటుక" పెట్టుకుంటున్నారా ? - మెదడు, ఎముకలపై దుష్ప్రభావమట!