Accident in Renigunta AP: ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంట-కడప జాతీయ రహదారిపై వెళుతున్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింటి. ఈ ఘటన సోమవారం (జనవరి 20న) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన దంపతులు సందీప్ షా(45), అంజలీదేవీ(40) ప్రాణాలు విడిచారు. దీంతో వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నివాసం ఉంటున్న సందీప్ షా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా కుక్కల దొడ్డి మండమూరి మధ్య వీరి కారుని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. బిహార్‌కు చెందిన సందీప్ షా తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు వచ్చి కొన్నేళ్ల క్రితం స్థిర పడ్డారు. సందీప్ షా ఇక్కడే వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పటాన్చెరు సమీపంలోని సీతారాంపురం కాలనీలో వీరు ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు.
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం : రెండ్రోజుల క్రితం సందీప్ షా, అతని భార్య అంజలీ దేవి తమ ముగ్గురు పిల్లలతో ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లారు. దానిలో భాగంగా తిరుమల తిరుపతి, తిరుచానూరు, అరుణాచలం, కాణిపాకం పుణ్యక్షేత్రాలు దర్శించుకుని తిరిగి పటాన్‌చెరుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మృతుడు సందీప్ షా పెద్ద కూతురు చంచలా షా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమ బంధువులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి చిన్న కూతురు సోనాలి షా, రుద్రప్రతాప్ షా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసి సందీప్ షా ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వృద్ధులు కావడంతో తమ కుమారుడు చనిపోయాడని వారికి చెప్పలేక, మృతదేహాలు వచ్చేవరకు ఎవరూ ఇంటికి కూడా వెళ్లకుండా ఈ విషయాన్ని వారికి చెప్పలేదు. అయితే డ్రైవర్ నరేష్ కుమార్‌ను తీసుకెళ్లినప్పటికీ అతన్ని వెనక కూర్చోబెట్టి సందీప్ షా డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం తెలిసింది.
జహీరాబాద్, బీదర్ రహదారిపై ఘోర ప్రమాదం - ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి
ఆ రాశి వారికి యాక్సిడెంట్ జరిగే అవకాశం! అప్రమత్తంగా ఉంటే మేలు!!