How to Change From Non Veg to Veg: మన ఆరోగ్యంంగా ఉండాలన్నా.. శక్తిమంతంగా పనిచేయాలన్నా తగిన స్థాయిలో ప్రోటీన్లు ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే, శాకాహారం తినడం వల్ల కొన్ని పోషకాలు అందవని.. అవి కేవలం మాంసాహారంలోనే ఉంటాయని కొంతమంది అనుకుంటుంటారు. మరి ఇందులో వాస్తవమెంత? శాకాహారం తినడం వల్ల పోషకాలన్నీ అందుతాయా?అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారంలో ఉండే పోషకాలు శాకాహారంలో దొరకవని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ తగిన మోతాదులో వెజ్ తీసుకుంటే నాన్‌వెజ్ తినడం వల్ల వచ్చే చాలా సమస్యల్ని నివారించొచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకి శ్రీనాథ్ చెబుతున్నారు. అయితే, మీ ఆహారపు అలవాట్లు మార్చుకునే ముందు కొన్ని విషయాలు గమనించుకోవాలని సూచిస్తున్నారు. అందులో ప్రొటీన్ ఎంత మోతాదులో తీసుకుంటామనే విషయం ముఖ్యమైనదని అంటున్నారు. దీంతో పాటు రోజులో ఎంత శాతం మాంసకృత్తులు తింటున్నారన్నది కూడా ముందు తెలుసుకోవాలని వివరిస్తున్నారు. సాధారణంగా కేజీ బరువుకి 1 గ్రా. ప్రొటీన్ అవసరమని.. దీని ఆధారంగా మీ డైట్‌చార్ట్ ఉండాలని సూచిస్తున్నారు.
వెజిటేరియన్ డైట్‌లో కార్బ్స్ అధికంగా ఉంటాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం అన్నం, చపాతీ లాంటివి తక్కువగా తీసుకుంటూ, పప్పులు ఎక్కువగా తినాలి. సుమారు 100 గ్రా. పప్పుదినుసుల్లో 20 గ్రా. ప్రొటీన్ ఉంటుంది. పాలు, పాలసంబంధిత పదార్థాలు రోజుకి 300 గ్రాములు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు కూడా సమపాళ్లలో అందుతాయి.
రోజులో ఒకపూట మినప్పప్పు, శనగపిండి, శనగలు, పెసలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు గుగ్గిళ్లు, ఆవిరి కుడుము, పెసరట్టు, దోశ, డోక్లా లాంటివి తినాలని చెబుతున్నారు. ఇవేకాకుండా సోయా నగెట్స్, సోయా పాలు, మీల్‌మేకర్, టోఫు లాంటివి తిన్నా తగిన మోతాదులో మాంసకృత్తులు అందుతాయని వివరిస్తున్నారు. ఆకుకూరలు, నూనెగింజలు, నువ్వులు, చియా, వాల్‌నట్స్‌నూ తీసుకోండని వెల్లడిస్తున్నారు. అయితే బి12, హిమోగ్లోబిన్ స్థాయుల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. ఒక్కసారిగా శాకాహారిగా మారడం వల్ల ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మహిళల్లో ఈ విటమిన్లు తప్పక ఉండాలట- అవేంటి? ఎందులో లభిస్తాయో మీకు తెలుసా?
స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా? అసలు డయాబెటిస్ ఎందుకు వ్యాపిస్తుంది?