Hundreds Animals Killed In Dallas : అమెరికాలోని డల్లాస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల 500కు పైగా జంతువులు మృత్యువాతపడ్డాయి. శుక్రవారం ఉదయం ఓ షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
డల్లాస్లోని ప్లాజా లాటినాలోని పెట్ షాప్‌లో 579 జంతువులు ప్రమాదకర పొగ పీల్చడం వల్ల చనిపోయాయని ఫైర్ సిబ్బంది జాసన్ ఎవాన్స్ తెలిపారు. వాటిలో ఎక్కువ చిన్న పక్షులేనని వెల్లడించారు. కోళ్లు, చిట్టెలుకలు, రెండు కుక్కలు, రెండు పిల్లులు అగ్నిప్రమాదానికి బలయ్యాయని పేర్కొన్నారు. అగ్ని జ్వాలలు వల్ల జంతువులు చనిపోలేదని, పొగ పీల్చడం వల్ల మరణించాయని వివరించారు.
హుటాహుటిన ఘటనాస్థలికి
"ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. 45 మంది అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. డల్లాస్ ఫైర్ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నప్పటికే పెట్ షాపులోకి జంతువులన్నీ పొగ పీల్చి, ఊపిరాడక చనిపోయాయి. అగ్ని ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. షాపింగ్ సెంటర్ మొదటి అంతస్తు పాక్షికంగా దెబ్బతింది" అని డల్లాస్ ఫైర్ రెస్క్యూ ప్రతినిధి జాసన్ ఎవాన్స్ పేర్కొన్నారు.
కాగా, ప్రమాదానికి గురైన షాపింగ్ సెంటర్లో అనేక వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఫుడ్, ఇతర సామగ్రిని అక్కడ అమ్ముతారు. అయితే ఈ షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.