Kejriwal ACB Notice : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ దిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ డబ్బు ఎరవేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ - ఆప్ నేతల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడం వల్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. బీజేపీపై చేసిన విమర్శలకు ఆధారాలు, వివరాలు సమర్పించాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 16 మందిని ప్రలోభపెట్టారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తనదేనా అని కేజ్రీవాల్‌ను అధికారులు ఆరా తీశారు. ఆ 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరారు. నిరాధారమైన ఆరోపణలు చేసి ఉంటే న్యాయపరమైన చర్యలు తప్పవంటూ నోటీసులో కేజ్రీవాల్‌ను హెచ్చరించారు.
కేజ్రీ ఇంటిముందు హైడ్రామా!
ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎరవేసి, తమ పార్టీని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్రంగా పరిగణించారు. అనంతరం యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారుల టీమ్ ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. అయితే ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా అధికారులు వచ్చారని, గంటన్నర తర్వాత నోటీసులు అందించారని ఆప్ లీగల్ సెల్ అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ తెలిపారు. బీజేపీతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సరైనవేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. 16మంది కంటే ఎక్కువ మందిని ఆప్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.