Fireworks Explosion At Tamil Nadu : తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
విరుద్‌నగర్‌లోని సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధాలు వినిపించాయి.
నాలుగు గదులు నేలమట్టమయ్యాయి. ఆ గదుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రసాయనాలను కలిపే ప్రక్రియలో పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సాయినాథ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాలాజీ అనే వ్యక్తి ఈ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. నిర్లక్ష్యం, సరైన భద్రత లేకుండా కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు ఫ్యాక్టరీ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీ, శశిబాలన్, మేనేజర్ దాస్ ప్రకాశ్ సహా నలుగురిపై 5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల, గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.