Top 10 Post Office Schemes : మన కష్టార్జితంలో నుంచి కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేసుకోవాలి. ఇలా పొదుపు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొంత భరోసాను, బాసటను అందిస్తుంది. అత్యవసరాలను తీరుస్తుంది. ప్రతినెలా తమ ఆదాయంలో నుంచి చిన్నపాటి మొత్తాలను పొదుపు చేయాలని భావించే వారి ఎదుట ప్రస్తుతం చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే అత్యధికులు కోరుకునేది మాత్రం, తక్కువ రిస్క్‌తో ఎక్కువ ప్రయోజనాన్ని అందించే పొదుపు పథకాలనే. ఈ రకానికి చెందిన టాప్-10 పోస్టాఫీస్ పొదుపు పథకాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
1. పోస్టాఫీస్ పొదుపు ఖాతా
పోస్టాఫీస్ పొదుపు ఖాతాను ఎవరైనా తెరవొచ్చు. ఈ ఖాతాలో రూ.500 కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. ఇందులో జమచేసే డబ్బులపై 4 శాతం దాకా వడ్డీ వస్తుంది. ప్రతినెలా 10వ తేదీ నుంచి నెలాఖరు మధ్య ఉన్న అత్యల్ప నగదు బ్యాలెన్సు ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. నెలవారీ పొదుపుల కోసం ఈ ఖాతా బాగా పనికొస్తుంది.
2. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతా
ప్రతినెలా కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయాలని భావించేవారు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాను పోస్టాఫీసులో తెరుచుకోవచ్చు. ప్రతినెలా కనిష్ఠంగా రూ.100 కూడా పొదుపు చేయొచ్చు. గరిష్ఠంగా ప్రతినెలా ఎంత మొత్తం పొదుపు చేయొచ్చు అనే దానికి ఎలాంటి పరిమితీ లేదు. రాబోయే కొన్నేళ్లలో నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయాలనే లక్ష్యం ఉన్నవారికి ఈ ఖాతా ఉపయోగపడుతుంది. ఖాతాలోని డబ్బుపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి జమచేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ ఆదాయం బాగానే లభిస్తుంది.
3. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్స్(TD)
నిర్దిష్టంగా కొన్నేళ్లు మాత్రమే డబ్బును పొదుపు చేయాలని భావించే వారికి బెస్ట్ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ (TD) ఖాతా. రూ.1000 చెల్లించి ఈ ఖాతాను పోస్టాఫీసులో తెరుచుకోవచ్చు. ఈక్రమంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మన అవసరాలు, ఆర్థిక సామర్థ్యాలకు సరిపోలే వ్యవధిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ ఖాతాలో జమయ్యే డబ్బుపై మంచి వడ్డీరేటు లభిస్తుంది. ఖాతా వ్యవధి ఎన్ని సంవత్సరాలు పెరిగితే, వడ్డీరేటు అంతగా పెరుగుతుంది. వడ్డీపై ఏటా చక్రవడ్డీ లభించడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది.
4. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్
తమ పొదుపుల నుంచి నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి ఉత్తమ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ నెలవారీ ఆదాయ ఖాతా. ఉద్యోగ విరమణ పొందినవారు, ప్రతినెలా నిలకడైన ఆదాయాన్ని కోరుకునేవారు పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఈ ఖాతాను ఒక వ్యక్తే తెరిస్తే, గరిష్ఠంగా రూ.9 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను తెరిస్తే, గరిష్ఠంగా రూ.15 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. ఈ మొత్తంపై ప్రతినెలా వడ్డీ ఆదాయాన్ని అందిస్తారు.
5. సీనియర్ సిటిజెన్ల పొదుపు పథకం (SCSS)
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగినవారు సీనియర్ సిటిజెన్ల పొదుపు పథకం (SCSS)ను పోస్టాఫీసులో తెరుచుకోవచ్చు. ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.30 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో జమ చేసే డబ్బుపై అత్యధిక వడ్డీరేటు లభిస్తుంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. ఇంటి ఖర్చుల కోసం నిత్యం డబ్బులు అవసరమయ్యే వారికి ఈ ఖాతా ఉపయోగపడుతుంది.
6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
దీర్ఘకాలం పాటు డబ్బులను పొదుపు చేయాలని భావించే వారు తపాలా కార్యాలయంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను తెరుచుకోవాలి. ఇందులో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి రూ.1.50 లక్షల దాకా పొదుపు చేయొచ్చు. దీనిపై పన్నులు కూడా విధించరు. ఈ ఖాతాలోకి డబ్బులను ప్రతి సంవత్సరం ఒకేసారి డిపాజిట్ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉంది. లేదంటే ప్రతినెలా కొంత మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. ఈ ఖాతాకు మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. అప్పటివరకు జమయ్యే డబ్బులను తీసుకొని రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. కీలకమైన ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.
7.సుకన్య సమృద్ధి ఖాతా (SSA)
బాలికల విద్య, భవిష్యత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో సుకన్య సమృద్ధి ఖాతా (SSA)ను పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో జమ చేసే డబ్బులపై గరిష్ఠంగా 8.2 శాతం దాకా వడ్డీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం కనిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల దాకా ఖాతాలో జమ చేసుకోవచ్చు. బాలిక వయసు 21 ఏళ్లకు చేరిన తర్వాత లేదా 18 ఏళ్ల తర్వాత బాలికకు పెళ్లి చేసే సమయంలో ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక ఉన్నవారికి ఈ ఖాతా ఉపయోగపడుతుంది.
8. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)
కనిష్ఠంగా రూ.1000 నుంచి మొదలుకొని ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే కనీసం ఐదేళ్ల పాటు వేచిచూడాలి. పెట్టుబడి పెట్టే డబ్బుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. దీనివల్ల ఆ డబ్బు, వడ్డీ ఆదాయపు బలంతో త్వరగా పెరిగే అవకాశాలు ఉంటాయి.
9. కిసాన్ వికాస్ పత్ర (KVP)
మనం తపాలా కార్యాలయంలో కిసాన్ వికాస్ పత్ర (KVP) పొందొచ్చు. ఇందులో డిపాజిట్ చేసే డబ్బులు దాదాపు 124 నెలల్లో డబుల్ (రెట్టింపు) అవుతాయి. దీర్ఘకాలంలో తమ సంపద పెరగాలని కోరుకునే వారికి ఈ స్కీం ఉత్తమమైంది. ఇందులో గరిష్ఠం పరిమితి అంటూ ఏమీ లేదు. సురక్షితమైన పెట్టుబడి మార్గమిది.
10. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పోస్టాఫీసుల్లో లభిస్తుంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం ఈ స్కీంను అమలు చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.1000 నుంచి మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల దాకా ఈ స్కీంలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని ఈ పథకం అందిస్తుంది.