Cm Revanth Reddy Meeting With MLAS : కాంగ్రెస్ పార్టీ శాసనసభాపభా పక్షం ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎమ్సీఆర్హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సీఎం, ఎమ్మెల్యేల ముఖాముఖిగా జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీప దాస్‌మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. కొందరు ఎమ్మెల్యేల డిన్నర్ సమావేశం వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎమ్మెల్యేలతో సమావేశం : ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే అజెండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అధికారం చేపట్టాక గతంలో ఓ సారి సమావేశమైన ముఖ్యమంత్రి నియోజక వర్గాల సమస్యలు, పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మావన వనరుల అభివృద్ది సంస్థలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
42శాతం సీట్లు ఇస్తామనే హామీపై : రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, బడ్జెట్ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల్లో 42శాతం సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం సహా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
ప్రజా సమస్యల పరిష్కారానికి : రాజకీయాంశాలపైనా ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. తాము చెప్పిన పనులు కావడం లేదని ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటుచేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల ప్రచారం, ఇన్‌ఛార్జీ మంత్రుల పనితీరుపై చర్చించారు. ఒకరిద్దరు మంత్రులపై వేణుగోపాల్ గట్టిగానే మాట్లాడినట్లు చర్చ జరిగింది.
సమన్వయం పెరిగేలా : దీనికి కొనసాగింపుగా ఈ నెల 1న మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలిని కొందరు మంత్రులు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బహిర్గతం కావడం, మీడియాలో రావడం నష్టం చేకూరుస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా సీఎం దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వాళ్ల సిఫార్సు ప్రకారమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ - చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో కులసర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ - కులాల వారిగా ఎంతమంది ఉన్నారంటే?