Road Accident : ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు వెళ్లి ప్రశాంతంగా తిరిగి వస్తున్న వారిని విధి వక్రించింది. కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా తిరుగు పయనమవగా ట్రక్కు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. మధ్యప్రదేశ్ జబల్ పుర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారంకు చెందిన ఎనిమిది మంది మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలింపు : ఉదయం 8 గంటలు. మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని సిహోరా ప్రాంతం. హైవే వంతెనపైకి రాంగ్‌రూటులో వచ్చిన సిమెంట్ లోడ్ లారీ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు తుక్కుతుక్కుగా మారి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు దాంట్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారంతా ఏపీ వాసులుగా తొలుత భావించినా మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు.
మృతులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శశికాంత్ కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వీరంతా ఒకే వాహనంలో వెళ్లారు. ఘోర ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రయాణికులు క్షేమం : ఘటనా సమయంలో మినీ బస్సు వెనుకగా వచ్చిన తెలంగాణకు సంబంధించిన కారు సైతం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.