PM Modi AI Summit : కృత్రిమ మేధస్సు(AI)పై అంతర్జాతీయ స్థాయిలో విధివిధానాలు, ప్రమాణాల రూపకల్పన దిశగా ప్రపంచ దేశాలు ఉమ్మడి కృషి చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ నిర్వహణతో ముడిపడిన నైతిక నియమావళి, ఆ సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడంపై విలువైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మంగళవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 'ఏఐ యాక్షన్ సదస్సు'కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి సహ-సారథ్యం వహిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. 'ఏఐ' సాంకేతికతను ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లో ఉన్న దేశాలకు అందేలా చూడాలన్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా, నైపుణ్యాలపరంగా, ఇంధనవనరుల పరంగా వెనుకంజలో ఉన్న ఆయా దేశాలకు దన్నుగా నిలవాలని భారత ప్రధాని కోరారు.
'మేం (భారత్) సొంతంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను మా దేశంలోని స్టార్టప్‌లు, పరిశోధకులకు చౌక ధరకు అందిస్తాం. మా దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మోదీ వెల్లడించారు.
#WATCH | " we are at the dawn of the ai age that will shape the course of humanity," says pm modi at the ai action summit in paris.
— ANI (@ANI) February 11, 2025
(source: dd) pic.twitter.com/MOevbFZXm8
ఓపెన్ సోర్స్ AI వ్యవస్థలు కావాలి
మానవజాతి భవిష్యత్ నిర్మాణంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మోదీ. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఏఐ ఉషోదయాన్ని కళ్లారా చూస్తోందని పేర్కొన్నారు. ఈ శతాబ్దంలో మానవ సమాజపు కోడ్‌ను ఏఐ రాస్తోందని కితాబిచ్చారు. 'మిగతా సాంకేతికతల కంటే ఏఐ భిన్నమైంది. అనూహ్య వేగంతో ఇది వికసిస్తోంది. వేగంగా దీన్ని అందరూ అందిపుచ్చుకుంటున్నారు. దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా దీని వినియోగం జరుగుతోంది' అని మోదీ తెలిపారు. ఏఐ వల్ల రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయని ప్రధాని చెప్పారు.
'ప్రపంచ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల పురోగతికి ఏఐ తోడ్పడుతుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలు నిపుణులను, వనరులను సమకూర్చుకోవాలి. దేశాలన్నీ కలిసి విశ్వసనీయమైన, పారదర్శకమైన ఓపెన్ సోర్స్ ఏఐ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి' అని మోదీ పేర్కొన్నారు. ఏఐ వల్ల సైబర్ సెక్యూరిటీకి విఘాతం కలగకుండా, తప్పుడు సమాచార వ్యాప్తి జరగకుండా, డీప్ ఫేక్స్‌ను పర్యవేక్షించేలా యంత్రాంగాలను సిద్ధం చేసుకోవాలన్నారు.
#WATCH | During the AI Action Summit at the Grand Palais in Paris, Prime Minister Narendra Modi says " india and france have worked together for years through initiatives like the international solar alliance to harness the power of the sun. as we advance our partnership to ai, it… pic.twitter.com/7nrMunbMK0
— ANI (@ANI) February 11, 2025
ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు
'ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన అక్కర్లేదు. సాంకేతికత వల్ల పనిచేసే తీరులో మార్పు వస్తుంది. కొత్త రకం ఉద్యోగాలు ఏర్పడతాయి. అంతే తప్ప పనిని కోల్పోవడం అనేది జరగదు' అని భారత ప్రధాని వ్యాఖ్యానించారు. ఏఐతో నడవనున్న భవిష్యత్తుకు అనుగుణంగా ప్రజలకు నైపుణ్యాలను నేర్పించడంపై ప్రపంచ దేశాలు శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకుముందు ప్యారిస్ నగరంలోని విమానాశ్రయంలో భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ సాయుధ దళాల శాఖ మంత్రి సెబాస్టియన్ లీకోర్ను స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు సైతం అక్కడికి చేరుకుని మోదీకి ఆప్యాయపూర్వక అభివాదాలు చేశారు.
చాట్‌జీపీటీలో కొత్త ఏఐ టూల్- ఇది డీప్‌సీక్‌కు చెక్ పెట్టనుందా?