Stones Falling People Houses in Mahabubabad : అర్థరాత్రి సమయంలో తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని మహబూబాబాద్ టౌన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీలోని వడ్డెర కాలనీలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీలో గత పదిహేను రోజుల నుంచి రాత్రి వేళల్లో తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయంటూ కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
అంతుచిక్కని రాళ్ల దాడి : రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ రాళ్లు అసలు ఎలా పడుతున్నాయో తెలుసుకుందామంటే వారికి అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై కాలనీ వాసులు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ ఫిర్యాదు అందిన వెంటనే కాలనీని పరిశీలించినట్లు స్థానికులు చెప్పారు.
"మహబూబాబాద్ పట్టణం వడ్డెర కాలనీలో పదిహేను రోజుల క్రితం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లపై రాళ్లు వేయడం జరిగింది. రాళ్లు ఎవరు వేయటంలేదని గాలిలో నుంచి వచ్చి పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేము రెండు మూడు రోజులు రాత్రి కాపలా ఉన్నాం. మేము ఉన్నప్పుడు రాళ్లు పడట్లేవు. అటు ఇటు తిరిగినప్పుడు రాళ్లు పడుతున్నాయి. ఎవరు వేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనికి తోడు ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై పోలీసులు వచ్చి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు" -యాకన్న, స్థానికుడు
అవగాహన కల్పించాలి : గత 2 సంవత్సరాల నుంచి కాలనీలో వివిధ కారణాలతో 8 మంది మృతి చెందారని, కాలనీ పరిసర ప్రాంతాల్లో చేత బడులు చేసిన ఆనవాళ్లు కనపడుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాళ్ల భయంతో కాలనీ వాసులు కాపలా కూడా ఉంటున్నారు. జన విజ్ఞాన వేదిక ద్వారా మూఢనమ్మకాలు లేవని అక్కడి స్థానికులకు అవగాహన కల్పించి, కళాకారులతో కళా ప్రదర్శనను ఏర్పాటు చేసి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అక్రమ కలప కోసం ఇళ్లల్లో సోదాలు - అటవీ అధికారులపై గ్రామస్థుల రాళ్ల దాడి