Sheikh Hasina Father House Fire : బంగ్లాదేశ్లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పంటించారు. అది కూడా షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తున్న సమయంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హసీనా స్పందింస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదని గుర్తించుకోవాలని పేర్కొన్నారు.
మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో షేక్ హసీనా ప్రసంగిస్తే బుల్డోజర్ ఊరేగింపు నిర్వహించాలని నిరసనకారులు పోస్ట్లు పెట్టారు. బుధవారం వామీ లీగ్ నిర్వహించిన సమావేశంలో షేక్ హసీనా వర్చువల్గా పాల్గొన్నారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే హసీనా తండ్రి రెహమాన్ నివాసం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చారు. ఇంట్లోకి చొరబడి అక్కడ ఉన్న వస్తువులను. రెహమాన్ చిత్రపటాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని, అంతేకాక 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు.
#WATCH | An angry mob vandalized the memorial and residence of Bangladesh’s founding father, Sheikh Mujibur Rahman, located at Dhanmondi 32 in Bangladesh, demanding a ban on Awami League - the party he founded. (05.02.2025) pic.twitter.com/5rVLXot6f1
— ANI (@ANI) February 6, 2025
హసీనా తండ్రి ముజిబర్ రహ్మన్‌కు బంగబంధుగా పేరుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సాయంతో పూర్తిచేశారు. అనంతరం 1975లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది. రహ్మన్‌తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండటం వల్ల బతికిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నాంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.