HMPV Symptoms in Telugu: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ప్రపంచ దేశాలకు కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణించగా.. మరో కొత్త వ్యాధి విజృంభిస్తుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలేంటీ హెచ్‌ఎంపీవీ? ఈ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మరోవైపు చైనాలో HMPV వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి.
- ఏమిటీ హెచ్‌ఎంపీవీ?
- హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.
- దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.
- వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.
- ఇన్‌ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
- ఇది ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.
- చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
వ్యాప్తి ఇలా
- దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో
- వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం
- వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం వల్ల వ్యాపిస్తుందని అంటున్నారు.
నివారణ ఇలా
- తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.
- చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.
- ఇన్‌ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.
- దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
- వైరస్ సోకినవారు బయట తిరగకూడదు.
చికిత్స: ప్రస్తుతం హెచ్‌ఎంపీవీకి నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకానూ ఇంకా అభివృద్ధి చేయలేదని వెల్లడిస్తున్నారు. ఇంకా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో ఎన్ని క్రీములు రాసినా ఫలితం లేదా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి!
సడెన్గా వెజిటేరీయన్గా మారితే ఏం జరుగుతుంది? మాంసాహారంలో ఉండే పోషకాలన్నీ ఉంటాయా?