Which Oil is Best for Cooking:వంటకాల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనె వాడుతుంటారు. ప్రాంతాన్ని బట్టి, కుటుంబ అలవాట్లను బట్టి నూనెలు మారుతుంటాయి. సాధారణంగా ఎక్కువ మంది సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె, రైస్ బ్రాన్ వంటి ఆయిల్స్ వాడుతుంటారు. అయితే.. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ లహరి సూరపనేని చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారీ చేస్తుండడం వల్ల వాటిలోని సువాసనలు, పోషకాలు, రుచికి విఘాతం కలగదని.. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఈ నూనెతో చేసిన వంటను తినడం మంచిదని సూచిస్తున్నారు.
"హై స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను ఎంపిక చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచివి. డీప్ ఫ్రై చేయడానికి అవకాడో ఆయిల్ చాలా బెస్ట్ ఆప్షన్. అది దొరకని సమయంలో సన్ ఫ్లవర్, సోయా బీన్ ఆయిల్, డీప్ ఫ్రైకి వాడుకోవచ్చు. రోజువారీ వంటలకు పల్లీల నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటి నూనెలు వాడాలి. సలాడ్స్, కోల్డ్ టాపింగ్ చేయడానికి అన్నంలో నెయ్యి వేసుకున్నట్లుగా వాడాలంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, నెయ్యిని, అవిసే గింజల నూనెను వాడుకోవచ్చు. అన్ సాచురేటేడ్ ఫ్యాట్స్‌లో మోనో సాచురేటేడ్, పాలీ అన్ సాచురేటేడ్, ఫ్యాటీ యాసిడ్స్ వంటివి గుండెకు చాలా మంచిది. సోయా, ఆలివ్, నువ్వులు, పల్లీ నూనెల్లో ఎక్కువగా లభిస్తాయి. సాచురేటేడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న వంట నూనెలు తింటే అనారోగ్యం పాలవుతారు. అన్ సాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వంట నూనెల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇన్‌ఫ్లేమేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది."
-డాక్టర్ లహరి సూరపనేని, పోషకాహార నిపుణులు
బాదం నూనె: బాదం నూనెలో విటమిన్ E అధికంగా ఉంటుందని.. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి గుండే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఆలివ్ ఆయిల్:ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని పొట్ట తగ్గేందుకు ఉపయోగపడుతుందని.. దీనిని వంటల్లో వాడడం వల్ల డయాబెటిస్, హృదయ సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుందని అంటున్నారు.
అవకాడో ఆయిల్: అవకాడో ఆయిల్లో మోనో సాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని సూచిస్తున్నారు.
రైస్ బ్రాన్ ఆయిల్: రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరైజనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.