What to Eat with Cold :చలికాలంలో చాలా మందికి తరచూ జలుబు చేస్తుంటుంది. ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది. మెజార్టీ జనాల్లో ఇలాంటి లక్షణాలు త్వరగానే తగ్గితే.. కొందరిలో ఈ పరిస్థితి కొన్ని వారాల పాటు ఉండొచ్చు. ఇలా జలుబుచేసినప్పుడు చికాకు కలిగి.. ఏ పనిపైనా పూర్తిగా మనస్సు ఉండదు. అయితే.. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల జలుబు బారిన పడకుండా కాపాడుకోవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్ జానకీ శ్రీనాథ్' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
జలుబు ఒకరకమైన లక్షణం. సాధారణంగా మన శరీరం కొన్ని రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాల బారినపడ్డప్పుడు జలుబు చేస్తుంది. కొందరిలో జలుబుతో పాటు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ, జ్వరం ఉంటే దాని తీవ్రతను బట్టి.. ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సుగంధ ద్రవ్యాలతో మేలు!
జలుబు, జ్వరంతో బాధపడుతుంటే శరీరంలో ద్రవపదార్థాలను ఎక్కువగా కోల్పోతుంటాం. అందుకే, ఇలాంటప్పుడు గోరువెచ్చని నీళ్లు, సూప్స్, జావ వంటివి అధికంగా తీసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, వంటి సుగంధ ద్రవ్యాలనుఆహారంలో విరివిగా వినియోగించాలి. వీటన్నింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. త్వరగా జలుబు నుంచి ఉపశమనం అందిస్తాయి.
డైట్లో ఇవి ఉండాలి
జలుబుతో బాధపడుతుంటే నోటికి ఏదీ రుచించదు. అలాగని పథ్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ, తేలిగ్గా జీర్ణమయ్యేవీ.. క్యాలరీలు తక్కువగా, విటమిన్లు ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే రుచికరమైన పదార్థాలు తీసుకోవచ్చు. అయితే.. వేపుళ్లు, ప్రాసెస్డ్ పదార్థాలను తినకూడదు. ఉడికించిన కూరగాయలు, చిలగడ దుంప, ఆమ్లెట్, వెజిటబుల్ కట్లెట్, ఇడ్లీ, సేమ్యా, చికెన్, చేప వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
తరచూ జలుబు బారిన పడకూడదంటే.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉండే జామ, నిమ్మ, మునగాకు, బొప్పాయి.. వంటివి డైట్లో భాగం చేసుకోవాలి. అలాగే రక్తహీనత సమస్య ఉందేమో గమనించుకోవాలి. దాన్ని అధిగమించడానికి తగిన ఫుడ్ తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే సరిపోతుంది.
"కొందరు జామకాయ, నిమ్మకాయ వంటివి తింటే జలుబు వస్తుందంటారు. కానీ ఇది నిజం కాదు. కేవలం అపోహ మాత్రమే. అయితే, అన్ని ఆహార పదార్థాలూ అందరికీ పడకపోవచ్చు. అలాంటివారు పడని వాటికి ఉండవచ్చు." -డాక్టర్ జానకీ శ్రీనాథ్ (పోషకాహార నిపుణురాలు)
NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలా? ఈ 6 లక్షణాలు ఉంటే అలర్ట్ కావాల్సిందే!
పొడి దగ్గు వేధిస్తోందా? - ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుందట!