Is Charcoal Toothpaste is Safe for Teeth: పూర్వ కాలంలో పళ్లు తోముకోవడానికి వేప, తంగేడు పుల్లలు వంటివి వినియోగించేవారు. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా టూత్‌పేస్ట్ కనిపిస్తుంది. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్లు, దంతాల మీద మరకలు తొలగించడం కోసం ఈ టూత్‌పేస్ట్ను ఉపయోగిస్తుంటాం. ఇక మనం వాడే టూత్‌పేస్ట్‌లో రకరకాలు ఉంటాయి. కొద్దిమంది తెలుపు రంగులో ఉండే పేస్ట్ వాడితే.. మరికొందరు ఎరుపు రంగులో ఉండేది వాడుతుంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా నలుపు రంగులో ఉండే టూత్‌పేస్ట్ కూడా ఉంది. అదే చార్‌కోల్ టూత్‌పేస్ట్. యాక్చివేటెడ్ చార్‌కోల్, కొబ్బరినూనె సహా ఇతర పదార్థాలతో తయారైన ఈ పేస్ట్‌ను ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్నారు. ఇంతకీ ఈ టూత్‌పేస్ట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? డైలీ ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
చార్‌కోల్ టూత్ పేస్ట్ వల్ల లాభాలు:
మరకలను తొలగిస్తుంది: చార్‌కోల్ టూత్‌పేస్ట్‌లోని అడ్సోర్బ్షన్ లక్షణం.. దంతాల మీద ఉండే మరకలను, ముఖ్యంగా కాఫీ, టీ, వైన్ వంటి వాటి వల్ల వచ్చే మరకలను తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ బృంద సభ్యులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది: చార్‌కోల్ నోటిలోని బాక్టీరియాను, ఇతర కలుషితాలను తొలగించడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
ఫలకాన్ని తగ్గిస్తుంది: కొన్ని అధ్యయనాల ప్రకారం, చార్‌కోల్ టూత్‌పేస్ట్ దంతాల మీద ఫలకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అంటున్నారు. ఫలకం అనేది బాక్టీరియా, ఆహార వ్యర్థాలతో కూడిన జిగటగా ఉండే పొర.
చార్‌కోల్ టూత్ పేస్ట్ వల్ల నష్టాలు :
చార్‌కోల్ టూత్‌పేస్ట్ను సరైన మోతాదులో వాడటం సురక్షితమైనప్పటికీ.. ప్రతిరోజూ వాడటం వల్ల లాభాల కంటే నష్టాలు అధికమంటున్నారు. అవేంటంటే..
దంతాల ఎనామిల్‌ను దెబ్బతీయవచ్చు: కొన్ని చార్‌కోల్ టూత్‌పేస్ట్‌లు చాలా కఠినంగా ఉంటాయి. వాటిలో ఉండే రాపిడి గుణం వల్ల దంతాల పైన ఉండే ఎనామిల్ పొర అరిగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎనామిల్ అనేది దంతాలకు రక్షణ కవచం లాంటిది. అది దెబ్బతింటే దంతాలు సున్నితంగా మారతాయని.. చల్లటి, వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి కలుగుతుందని.. దంతక్షయం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయంటున్నారు.
అన్ని రకాల మరకలను తొలగించదు: చార్‌కోల్ టూత్‌పేస్ట్ ఉపరితల మరకలను మాత్రమే తొలగిస్తుంది. అంటే, కాఫీ, టీ, సిగరెట్ వంటి వాటి వల్ల వచ్చే మరకలను ఇది తొలగించగలదు. కానీ, దంతాల లోపలి పొరల్లో ఏర్పడే మరకలను ఇది తొలగించలేదని అంటున్నారు.
చిగుళ్ల నుంచి రక్తం: చార్‌కోల్ టూత్‌పేస్ట్ అధికంగా ఉపయోగించినప్పుడు చిగుళ్లు ఎర్రబడటం, వాపు, నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలు రావొచ్చని అంటున్నారు.
నల్లటి అవశేషాలు: చార్‌కోల్ నల్లగా ఉండటం వల్ల బ్రష్ చేసిన తర్వాత నోటిలో నల్లటి అవశేషాలు ఉండవచ్చు. వీటిని పూర్తిగా తొలగించడానికి నోటిని బాగా కడగవలసి ఉంటుంది.
ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్: అయితే కేవలం ఈ చార్‌కోల్ టూత్‌పేస్ట్ మాత్రమే కాకుండా.. ఏ టూత్‌పేస్ట్ వాడినా అందులో ఫ్లోరైడ్ ఉండేలా చూసుకోమంటున్నారు నిపుణులు. పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉండటం వల్ల పలు లాభాలు ఉన్నాయంటున్నారు.
ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది: ఫ్లోరైడ్ దంతాల ఉపరితలంపై ఉన్న ఎనామిల్‌లో కలిసిపోయి, దానిని మరింత దృఢంగా చేస్తుంది. ఇది ఆమ్లాలు దాడి చేసినప్పుడు దంతాలు పాడవకుండా కాపాడుతుంది.
క్షయాన్ని నివారిస్తుంది: ఆహారం తిన్న తర్వాత నోటిలో బ్యాక్టీరియా చక్కెరలను ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ ఆమ్లాలు ఎనామిల్‌ను బలహీనపరుస్తాయి, దీనివల్ల దంత క్షయం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను.. ఫ్లోరైడ్ నెమ్మదిస్తుంది. కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా చేస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లల్లో దంత సమస్యలా? ఈ టిప్స్ క్యావిటీస్, ఇన్ఫెక్షన్లు నుంచి రిలీఫ్!
దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!