PolItical Parties in Sandhya Theatre Issue : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకోవడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా సహకరించాలని సూచించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన నేతలు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఖర్చులన్నీ అల్లు అర్జున్ భరించాలి : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పలు రాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందించాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని ఆమె కోరారు. శ్రీతేజ్ కుటుంబాన్ని, అతని వైద్య ఖర్చులను హీరో అల్లు అర్జున్ భరించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం మంచి పద్ధతి కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
సినిమాలకు సంబంధించి చట్టాలు చేయాలి : సినీ రంగాన్ని ప్రక్షాళన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలుడు శ్రీతేజ్‌ను కూనంనేని పరామర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సినిమాలకు సంబంధించి కొత్త చట్టాలు చేయాల్సిన పరిస్థితి ఉందని, సెన్సార్ బోర్డు కూడా దీనిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.
ఇంటి వద్దే ఎందుకు ఆపలేదు : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సీనియర్ సభ్యుడు బీవీ రాఘవులు సానుభూతి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ సినిమా చూసేందుకు అనుమతి నిరాకరించామన్న పోలీసులు ఆయన్ను ఇంటి వద్దే ఎందుకు నిలువరించలేదని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు.
బాబు ఇంకా మమ్మల్ని గుర్తుపట్టడం లేదు - కేసు వెనక్కి తీసుకుంటాను : శ్రీతేజ్ తండ్రి భాస్కర్
అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు - దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త!