Fast Walking Benefits : వేగంగా వాకింగ్ చేసేవారు మధుమేహం, హృదయ, జీవక్రియ సంబంధిత వ్యాధుల ముప్పును తక్కువగా ఎదుర్కొంటారని తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా నడిచేవారితో పోలిస్తే స్పీడ్‌గా వాకింగ్ చేసేవారిలో ఈ వ్యాధులు సోకే ప్రమాదం తక్కువని జపాన్‌లోని దోషిషా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది.
25,000 మందిపై పరిశోధనలు
స్థూలకాయం, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉన్న 25,000 మందిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో వేగంగా వాకింగ్ చేసిన వ్యక్తుల్లో మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే హైపర్ టెన్షన్, డైస్లిపిడెమియా వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే వేగంగా నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై సైంటిస్టులు పరిశోధనలు చేసి పలు కీలక విషయాలను కనుగొన్నారు.
'వేగంగా నడిస్తే ప్రయోజనాలు'
"వేగంగా నడిచేవారు తరచుగా మెరుగైన కార్డియోస్పిరేటరీ ఫిట్ నెస్ ని కలిగి ఉంటారు. వారు తక్కువ స్థాయిలో కడుపు మంట, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగి ఉంటారు. ఈ అధ్యయనం ఊబకాయం, జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై జరిపాం. స్పీడ్ గా వాకింగ్ చేసేవారు బీపీ, డయాబెటిస్, డైస్లిపిడెమియా వంటి వ్యాధులు బారిన పడే అవకాశం తక్కువని తేలింది. " అని దోషిషా యూనివర్సిటీ పొఫెసర్, ప్రధాన పరిశోధకుడు కొజిరో ఇషి తెలిపారు.
"ఈ అధ్యయనాన్ని జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రామాణిక ప్రోటోకాల్ లో చేర్చారు. ఈ అధ్యయనాన్ని త్వరగా, సులభంగా చేశాం. వేగవంతమైన నడక వల్ల జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ఊబకాయం ఉండేవారికి స్పీడ్ వాకింగ్ బాగా పనికొస్తుంది"
--కొజిరో ఇషి, దోషిషా యూనివర్సిటీ పొఫెసర్
'స్పీడ్ వాకింగ్ ఆరోగ్యానికి మంచిది'
స్పీడ్ వాకింగ్ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. నార్మల్ వాకింగ్ చేసినవారితో పోలిస్తే స్పీడ్ గా నడిచేవారిలో హృద్రోగ, జీర్ణసంబంధిత, మధుమేహం ముప్పు తక్కువని అంచనా వేశారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.