Construction of Indiramma houses : వచ్చే కొత్త సంవత్సరం(2025)లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వే పూర్తయినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
హిమాయత్‌నగర్‌లోని హౌజింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఏటా నాలుగున్నర లక్షల చొప్పున వచ్చే నాలుగేళ్లలో కనీసం 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తుల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పారదర్శకంగా ఎంపిక : ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి నెలలో మొదటి వారానికి పూర్తవుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిన్న తప్పు కూడా జరగకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని, పేదల్లో అతి పేదలకే మొదటి విడతలో అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
వారం రోజుల్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు : కేంద్ర ప్రభుత్వ విధివిధానాల మేరకు యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొందరిని తిరస్కరించినప్పటికీ పూర్తి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారికి ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలో ప్రత్యేక విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుని ఫిర్యాదుదారునికి అప్డేట్ చేసే వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈ స్కీంలో రూ.5 లక్షలు ఫ్రీగా మనమిస్తున్నాం. ప్రతి మనిషి కూడా దీని కోసం ఆశ పడటంలో తప్పులేదు. కానీ మొదటగా నిరుపేదలకు ఇవ్వకపోతే మనం మంచి చేయబోతే చెడు జరుగుతుంది. లబ్ధిదారులను సైంటిఫిక్‌గా గుర్తించాలన్న ఉద్దేశంతో ఇంత లేట్ అయ్యింది. అది కూడా పూర్తికావొచ్చింది. డబ్బులున్నవాళ్లకు ఒకవేళ ఇల్లు శాంక్షన్ చేస్తే విజిలెన్స్ టీం ఆ అధికారి పైనా చర్యలు తీసుకుంటుంది. దీని కోసం నా ఆఫీసులో టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకువస్తున్నాం -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
త్వరలో సర్వేయర్ల నియామకం : గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి నియామకానికి కసరత్తు జరుగుతోందని, త్వరలో సుమారు 1200 మంది సర్వేయర్లను నియమిస్తామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నలువైపులా వంద ఎకరాల్లో మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ డేట్ వచ్చేసింది - సీఎం చేతుల మీదుగా ఆరోజే శ్రీకారం
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్ - 84 వేల ఇందిరమ్మ ఇళ్లు మీ కోసమే - కానీ ఆ ఒక్కటే సమస్య