Personal Loan Eligibility Myths : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ విధంగా వస్తాయో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చేవి వ్యక్తిగత రుణాలు. వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ లోన్స్ సౌకర్యవంతమైన రీపేమెంట్ వ్యవధిని కూడా అందిస్తాయి. అందుకే అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం అయినప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో పర్సనల్ లోన్ అప్రూవల్ గురించి చాలా మందికి అపోహలు ఉంటాయి. అలాంటి వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి క్రెడిట్ స్కోర్
మీ క్రెడిట్ స్కోరు 750కంటే ఎక్కువ ఉంటే రుణదాతలు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్‌ను ఆమోదిస్తారు. అయితే లోన్ అప్రూవల్‌కు ఇదొక్కటే సరిపోదు. రుణదాతలు క్రెడిట్ స్కోర్‌తో పాటు మీ ఆదాయం, ఉద్యోగి చరిత్ర, ఆదాయ-రుణాల నిష్పత్తి, క్రెడిట్ నివేదికను కూడా పరిశీలిస్తారు. మీకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇతర అంశాల ఆధారంగా తక్కువ లోన్ అమౌంట్, తక్కు రీపేమెంట్ వ్యవధితో పర్సనల్ లోన్ అప్రూవల్ అవుతుంది. అయితే వడ్డీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఉద్యోగులకే లోన్లు!
పర్సనల్ లోన్ పొందేందుకు ఉద్యోగులే కాదు స్వయం ఉపాధి ఉన్నవారు కూడా అర్హులే. అయితే సదరు బ్యాంకులో మీకు ఖాతా ఉండే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ వస్తాయి. స్థిరమైన ఆదాయం అనేది పర్సనల్ లోన్ పొందేందుకు ముఖ్యమైన అంశం. కొన్నిసార్లు ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం పొందలేకపోతే వారి లోన్ అప్లికేషన్ రిజెక్ట్ కావొచ్చు. అయితే స్వయం ఉపాధి ఉన్నవారు వ్యాపార ప్రకటనలు, పన్ను రిటర్నులు, ఇతర పత్రాలను లోన్ అప్రూవల్ కోసం సమర్పించాల్సి ఉంటుంది.
ఈజీగా లోన్‌కు అప్లై
పాతకాలంలా పర్సనల్ లోన్ కోసం పేజీల కొద్ది దరఖాస్తు పేపర్లను నింపక్కర్లేదు. అలాగే బ్యాంకు క్యూల్లోనూ నిల్చొనక్కర్లేదు. బ్యాంకును సందర్శించి అప్లికేషన్‌ను నింపొచ్చు. లేదంటే డిజిటల్ కేవైసీ చేసుకుని, ఆన్‌లైన్‌లో పర్సనల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇలా లోన్ కోసం అప్లై చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయొచ్చు.
ఎటువంటి హామీ అక్కర్లేదు!
పర్సనల్ లోన్లు అసురక్షిత రుణాలు. వ్యక్తిగత రుణం కోసం అప్లై చేసేటప్పుడు ఎటువంటి హామీ అవసరం లేదు. మీరు ఆస్తి, ఇంటి పత్రాలు లాంటి వాటిని తాకట్టు పెట్టకుండానే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, ఎక్కువ మొత్తంలో లోన్ పొందేందుకు షూరిటీ సంతకం పెట్టించొచ్చు.
బ్యాంకు ఖాతా
మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్న బ్యాంక్‌లో ఇప్పటికే ఖాతా ఉంటే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ వస్తాయి. అందువల్ల లోన్ అప్రూవల్ అవ్వగానే నిధులు మీ ఖాతాలోకి జమ అయిపోతాయి. వాస్తవానికి సదరు బ్యాంకులో మీకు అకౌంట్ లేకపోయినా ఫర్వాలేదు. మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం మొదలైనవి ఉండాలి.