Late Night Sleep Side Effects : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం ఎంత అవసరమో.. సరైన నిద్ర కూడా అంతే ముఖ్యం. ఒక మనిషికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర ఉన్నప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ నేటితరం.. రకరకాల కారణాలతో అర్ధరాత్రి దాకా నిద్రపోవట్లేదు. మరి.. దీనివల్ల మీ ఒంట్లో ఏం జరుగుతుందో హైదరాబాద్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే చెబుతున్నారు.
సిర్కాడియన్ రిథమ్ లయ తప్పుతుంది :డైలీ అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వారిలో అంతర్గత శరీర గడియారమైన సిర్కాడియన్ రిథమ్ గందరగోళానికి గురవుతుందంటున్నారు డాక్టర్ దిలీప్ గుడే. ఇది హార్మోన్ విడుదల, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ముఖ్యమైన విధులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
మెదడు సమస్యలు :తరచుగా మిడ్నైట్ దాటాక నిద్రపోయే వారిలో మెదడు సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్ దిలీప్. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక చురుకుదనం లోపించడం వంటి సమస్యలకు దారితీస్తుందంటున్నారు వైద్యులు.
హార్మోనల్ ఛేెంజెస్ :అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వారిలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయని సూచిస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన పెరుగుతుందని.. ఇది బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. 2014లో జరిపిన "Sleep timing and cortisol secretion in healthy young adults" అనే అధ్యయనం ప్రకారం.. రాత్రి 12 గంటల తర్వాత నిద్రపోయే వారిలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు.
వయసును బట్టి నిద్ర - మీరు ఎన్ని గంటలు పడుకోవాలో తెలుసా?
రోగనిరోధక శక్తి తగ్గుతుంది : దీర్ఘకాలిక నిద్ర లేమి.. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందంటున్నారు వైద్యులు. ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్‌లు చుట్టుముట్టే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
జీవక్రియ సమస్యలు :వీటన్నింటికీ మించి లేట్ నైట్ స్లీప్ శరీరం జీవక్రియకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని సూచిస్తున్నారు డాక్టర్ దిలీప్ గుడే. ఇది బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు, ఇతర జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు.
ఇవేకాకుండా.. ఆలస్యంగా నిద్రపోవడం మొత్తం మానసిక, శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అలాగే బలహీనమైన దృష్టి, బలహీనమైన జ్ఞాపకశక్తికి దారితీస్తుందంటున్నారు. కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్ స్థాయిని కూడా పెంచే ప్రమాదం ఉండవచ్చంటున్నారు.
కాబట్టి.. డైలీ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం.. రోజూ సరైన పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, డైలీ ఒకే టైమ్‌కు నిద్రపోవడం, పడుకునే ప్రదేశాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవడం వంటి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్ పదార్థాలకు దూరంగా ఉండాలని.. ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదని చెబుతున్నారు. ఇన్ని చేసినా.. నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
నోట్ :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిద్రలేమితో క్యాన్సర్ - డయాబెటిస్, హార్ట్ ఎటాక్ బోనస్! ఇంకా