Does Drinking Water Before Meals Help Lose Weight :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం, డైలీ డైట్లో అనేక మార్పులు చేస్తుంటారు. ఇంకొందరు నేచురల్ రెమిడీస్తో పాటు కొన్ని టిప్స్‌ను ఫాలో అవుతుంటారు. ఇదిలా ఉంటే కొందరు భోజనానికి ముందు వాటర్ తాగితే బరువు తగ్గుతారని సలహా ఇస్తుంటారు. నిజంగా ఇలా చేయడం ద్వారా బరువు తగ్గుతారా? ఇందులో వాస్తవమెంత? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భోజనానికి ముందు వాటర్ తాగడం బరువుతగ్గడానికి తోడ్పడుతుందా? అనే అంశంపై ఆరోగ్య నిపుణులు ఈ విధంగా వివరిస్తున్నారు.
కడుపు నిండిన ఫీలింగ్ : మీల్స్‌కి ముందుగా వాటర్ తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. మన పొట్టలో అనేక నరాలు ఉంటాయి. ఇవి నీటిని తాగినప్పుడు సాగి బ్రెయిన్‌కి ఆహారాన్ని తీసుకోవద్దని సంకేతాలు పంపుతాయట. ఫలితంగా ఆహారం తక్కువ తీసుకోవడం బరువు తగ్గడానికి దోహదపడుతుందంటున్నారు నిపుణులు. పలు పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. భోజనానికి ముందు వాటర్ తాగని వారితో పోలిస్తే తాగిన వారు ఆహారాన్ని తక్కువగా తీసుకున్నట్లు తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన మరో రీసెర్చ్‌లో కూడా లో క్యాలరీ డైట్ తీసుకుంటూ భోజనానికి ముందు నీటిని తాగని, తాగినవారినీ పరిశీలించారు. సుమారు 12 వారాలు పరిశీలించగా నీరు తాగనివారితో పోలిస్తే తాగినవారు బరువు తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్చేయండి.
ఆకలేసినా వాటర్ తాగితే సరిపోతుందట!
మనకు చాలా సార్లు ఆకలిగా అనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తుంటాం. కానీ, అలా అనిపించడం అన్ని సార్లు ఆకలి కాదంటున్నారు. దాహం వేసి కూడా కొన్ని సార్లు అలాంటి ఫీలింగ్ కలుగుతుందంటున్నారు నిపుణులు. ఆ టైమ్‌లో కొద్దిగా నీటిని తాగడం వల్ల అనవసర కేలరీల జోలికి వెళ్లకుండా ఉంటామంటున్నారు. దాంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోము. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందంటున్నారు.
వ్యాయామం చేసే ముందు వాటర్ తాగడం :చాలామంది వ్యాయామం చేసే సమయంలో కండరాలు పట్టేయడం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం బాడీ డీహైడ్రేషన్‌కి గురికావడమే అంటున్నారు. కాబట్టి, వ్యాయామంముందు తప్పనిసరిగా వాటర్ తీసుకుని బాడీని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలంటున్నారు.