Healthy Diet Chart for Breastfeeding Moms : తల్లిపాలు నవజాత శిశువుకు అమృతంతో సమానం. ముఖ్యంగా చనుబాలలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బిడ్డ ఎదుగుదలకు, ఆరోగ్యానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తప్పనిసరిగా వారికి తల్లిపాలు పట్టడం అత్యవసరం. కానీ, కొంతమంది తల్లులలో ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాంటి టైమ్‌లో బాలింతలు తమ రోజువారీ డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవి తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని సూచిస్తున్నారు. మరి, చనుబాలు ఎక్కువగా రావాలంటే తల్లులు ఎలాంటి పోషకాహారం, జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బిడ్డకు ఎన్ని ఎక్కువసార్లు పాలిస్తే పాల ఉత్పత్తి అంత ఎక్కువ పెరుగుతుందంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. కాబట్టి వీలైనంతమేర చనుబాలివ్వడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఇక ఆహారం విషయానికొస్తే బాలింతగా ఉన్నప్పుడు సమతులాహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు. పత్యం పేరుతో వేటికీ దూరం ఉండొద్దు. అయితే, ముఖ్యంగా ఒకేసారి ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోవాలంటున్నారు. తక్కువ మొత్తంలో మూడు గంటలకోసారి తినేట్లు డైట్‌చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల బిడ్డకు అవసరమైనప్పుడు తగినన్ని పాలు ఇవ్వగలుగుతారని చెబుతున్నారు.
అలాగే, రోజూ 3 లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలి. డైలీ డైట్‌లో పండ్లూ, కూరగాయలకూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. అదేవిధంగా పొట్టుతో ఉండే హోల్‌గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి రోజూవారి ఆహారంలో చేర్చుకోవాలి. వీటి నుంచి బి విటమిన్, మాంసకృత్తులు ఎక్కువగా లభిస్తాయి. ఇవేకాకుండా ప్రొటీన్స్ కోసం పప్పులు, పాలు, పాలసంబంధిత పదార్థాలనీ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. రోజులో 300మి.లీ. పాలు, 200మి.లీ. పెరుగు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే, బాలింతలు రోజుకో గుడ్డు తీసుకోవాలి. మాంసం చేపలూ తినొచ్చు. ఇలా పాలిచ్చే తల్లులు రోజువారి ఆహారంలో సమతులాహారం చేర్చుకోవడం చనుబాలు పెరగడానికి దోహదపడతాయంటున్నారు డాక్టర్ లతాశశి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తల్లిపాలు పెంచడంలో సహాయపడతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవేకాకుండా పాలిచ్చే తల్లుల్లు ఆకుకూరల్లో మునగ, కరివేపాకు లాంటి పొడుల్ని ఆహారంలో చేర్చుకోవాలి. వీటివల్ల కాల్షియం అధికంగా లభిస్తుంది. శనగలు, పెసలు, బఠాణీలు, బాదం, అవిసెలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే నట్స్‌నీ డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏం తిన్నా మితంగా, అవసరమైనంతే తీసుకోవాలని మరచిపోవద్దని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాశశి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
రీసెర్చ్: ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ తాగితే - బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందా ?
'తల్లులు సరిగ్గా నిద్రపోతేనే పిల్లలు హుషారుగా పుడతారు'- మరి ఎంత సేపు నిద్రపోవాలి?