How to Like Doing Exercise: మనలో చాలా మందికి వ్యాయామం చేయడం అంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎక్సర్‌సైజులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా సరే.. చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. దానికి కారణం అవి కొద్దిగా కష్టంగా ఉండడమే. కానీ ఈ ఎక్సర్‌సైజుల్లో కొన్ని స్వల్ప మార్పులు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చని Harvard-affiliated Spaulding Rehabilitation physical therapist Vijay A. Daryanani చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే మూడు ఎక్సర్సైజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్వాట్స్
స్క్వాట్స్ చేయడం వల్ల మన శరీరంలోని అన్ని కండరాలు ఒకేసారి కదలుతాయని డాక్టర్ విజయ్ చెబుతున్నారు. ఈ భంగిమ వల్ల ముఖ్యంగా నడుము కింది భాగం శరీరం చాలా దృఢంగా మారుతుందని వివరించారు. ఫలితంగా గాయాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని అంటున్నారు.
కానీ, స్క్వాట్స్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇంకా దీనిని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల నడుం నొప్పులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే, మీరు కూర్చుని నిల్చున్నప్పుడల్లా స్క్వాట్స్‌తో వచ్చే ప్రయోజనాలు అందుతాయని వివరించారు. కాబట్టి సిట్ టు స్టాండ్ వ్యాయామాలు చేయడం ద్వారా సులభంగా స్క్వాట్స్ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
మరి ఎలా చేస్తే ఈజీ!
ఓ కుర్చీలో పాదాలను కొద్దిగా వెడల్పుగా చేసి చేతులను మీ తొడలపై వేసి కుర్చోవాలి. ఇప్పుడు కడుపు కండరాలను బిగించి నిధానంగా నిలబడి కాస్త ఊపిరి పీల్చుకోవాలి. ఇలా కదలకుండా కాసేపు నిలబడి తర్వాత కుర్చీలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల స్క్వాట్స్ ఈజీగా చేసుకోవచ్చని తెలిపారు.
పుష్ అప్స్
పుష్ అప్స్ చేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. పై నుంచి కింది వరకు ఛాతీ, తొడలు, కాళ్లు ఇలా ప్రతి భాగానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ఎక్కువ పుష్ అప్స్ చేయలేకపోవడం, చేసే సమయంలో ఇబ్బంది పడడం వల్ల చాలా మంది దీనిని చేసేందుకు ఇష్టం చూపించరని విజయ్ తెలిపారు. ఇంకా ముఖ్యంగా మిలిటరీ, జిమ్ తరగుతుల్లో వీటిని శిక్షలుగా విధిస్తారని.. కాబట్టి పుష్ అప్స్ అనగానే చాలా మందిలో ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలు ఉంటాయని వివరించారు. అయితే, ఎన్ని పుష్ అప్స్ చేశామనే లెక్కించుకోకుండా.. సరైన పద్ధతిలో చేస్తే సరిపోతుందని విజయ్ సూచిస్తున్నారు. 10 సరికాని పుష్ అప్స్ చేయడం కన్నా సరైన పద్ధతిలో 5 చేస్తే సరిపోతుందని అంటున్నారు.
బ్రిడ్జ్స్
ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పిరుదులు, వెనుక భాగం కండరాలు శక్తిమంతంగా మారతాయని విజయ్ తెలిపారు. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉంటుంది కాబట్టే, సేతుబంధాసనమని పిలుస్తుంటారు.
ఎలా చేయాలి?
ముందు నేలపై వెల్లకిలా విశ్రాంతిగా పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్లను వంచి పాదాలను పిరుదులకు దగ్గరగా తీసుకురావాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకుని తుంటి, వీపు భాగాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. ఈ భంగిమలో 5 సెకన్లపాటు ఉండి, అదే క్రమంలో తిరిగి వెనక్కి రావాలి. అయితే, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు తుంటిని ఎత్తలేక, వీపు వంచలేక ఇబ్బంది పడుతుంటే మద్దతుగా దిండును ఉపయోగించాలని సూచించారు. ఇలా కాకుండా ఈ భంగిమను ఎక్కువసేపు చేయడం వల్ల వెనుక భాగం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని.. దిండును వాడడం వల్ల దీనిని తగ్గించవచ్చని తెలిపారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
భోజనానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే?
తిన్న తర్వాత కడుపులో నొప్పి, మంటగా ఉంటుందా? వదిలేస్తే క్యాన్సర్‌గా మారే ఛాన్స్!