Diabetes Symptoms and Causes : నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా విస్తరిస్తోన్న వ్యాధి డయాబెటిస్. ఈ వ్యాధి ఒక్కసారి ఎటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి వ్యాధి బారిన పడకూడదని అందరూ కోరుకుంటారు. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్ కాగా, రెండోది టైప్ 2. మరి, ఇవి రావడానికి కారణాలేంటి? ముందుగానే ఎలా గుర్తించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
టైప్ 1 డయాబెటిస్ :
టైప్ 1 డయాబెటిస్ ఉంటే బాడీలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది లేదా కాకపోవచ్చు. ఇన్సులిన్ హార్మోన్ తయారయ్యే పాంక్రియాస్లో కణాలు నాశనమవుతాయి. నార్మల్‌గా ఇది పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. కానీ, కొందరిలో ఏ వయసులోనైనా టైప్ 1 మధుమేహం కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఆరోగ్యంగా ఉండడానికి డైలీ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలు :
- టైప్ 1 డయాబెటిస్ వచ్చిన వారిలో అసాధారణ స్థాయిలో దాహం వేస్తుంది.
- ఆకలి ఎక్కువగా ఉంటుంది.
- బరువు తగ్గుతారు.
- తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
- తీవ్ర అలసటగా ఉంటుంది
- కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
నైట్ డ్యూటీ చేసే వారికి షుగర్ వ్యాధి వస్తుందా? డాక్టర్లు ఏం అంటున్నారో తెలుసా?
టైప్ 2 డయాబెటిస్ :
ఈ పరిస్థితి ఉన్నవారి శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. పాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేస్తూ ఉండవచ్చు. కానీ, బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయులు కంట్రోల్లో ఉండడానికి తగినంతగా ఇన్సులిన్ స్థాయులు ఉండవు. ఈ రకం మధుమేహం ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం, వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటివి ఈ రకం డయాబెటిస్ రావడానికి కారణమవుతాయంటున్నారు. చాలా మందిలో కనిపించే డయాబెటిస్ వ్యాధి రకం ఇదేనని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలు :
- అధిక మూత్రవిసర్జన
- విపరీతమైన దాహం, ఆకలి
- అలసట
- పుండ్లు త్వరగా మానకపోవడం
- తరచుగా వచ్చే అంటువ్యాధులు
- ఆకస్మాత్తుగా బరువు తగ్గడం
- పాదాలు లేదా చేతుల్లో నొప్పి, తిమ్మిరి లేదా జలదరింపు
- లైంగిక సమస్యలు
- ఛాతీ నొప్పి
- కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోజూ ఎంత సేపు నడిస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
టైప్ 1, 2 డయాబెటిస్తో పాటు జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, మోనోజెనిక్ మధుమేహం వంటి పలు రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్((NIDDK) నివేదిక ప్రకారం, షుగర్ వ్యాధిలో చాలా రకాలుంటాయని కనుగొన్నారు పరిశోధకులు. అలాగే, ఏ రకం డయాబెటిస్‌లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో కూడా వారు గుర్తించారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డయాబెటిస్ వల్ల ఎన్నో ప్రమాదకర రోగాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. అంతేకాదు, కంటి చూపు కోల్పోయే ఛాన్స్ ఉంది. నరాలు దెబ్బతిని అస్తవ్యస్తం అవుతాయి. కాబట్టి, షుగర్ విషయంలో అలర్ట్‌గా ఉండాలని, తప్పకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పై లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకంటూ, రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మధుమేహం ఉన్నా ఈ పండ్లను హాయిగా తినొచ్చట! ఇవి తింటే షుగర్ పెరగదని నిపుణుల సలహా