Weight Loss Surgery :మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పని చేయటం వంటి వివిధ కారణాలతో.. నేడు చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడున్నారు. ఊబకాయం వచ్చిన తర్వాత.. మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వీరిని అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి చుట్టు ముడుతుంటాయి. అయితే.. అధిక బరువుతో బాధపడేవారు వెయిట్ లాస్ సర్జరీ చేసుకోవడం ద్వారా.. హైబీపీ సమస్యను తగ్గించుకోవచ్చని ఒక పరిశోధన చెబుతోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏంటా శస్త్రచికిత్స?
ఊబకాయంతో బాధపడేవారు.. శరీర బరువును తగ్గించుకోవడానికి ఆపరేషన్ చేయించురుంటారు. దీన్నే బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఈ చికిత్స వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుందట. ఈ ఆపరేషన్ చేయించుకున్న కొందరిలో హైబీపీ తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారట.
రిస్క్ ఎక్కువే..
బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గడంతోపాటు బీపీకి చెక్ పెట్టే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ.. దీని వల్ల రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సర్జరీ అనేది అందరిలోనూ ఒకేవిధమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి లేదంటున్నారు. కొందరిలో సత్ఫలితాలు కనిపించినా.. మరికొందరిలో దుష్ఫలితాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఇంకొందరిలో ముందుగా బాగానే అనిపించినా.. దీర్ఘకాలంలో ఇబ్బందులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. చికిత్స కన్నా నివారణే మేలు అన్నట్టుగా బరువు పెరగకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.