Does Working Night Shift Cause Diabetes: ప్రస్తుత డిజిటల్ యుగంలో నైట్ షిఫ్ట్‌లు సర్వ సాధారణంగా మారిపోయాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అయితే.. నైట్ డ్యూటీల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పీవీ రావు వివరిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని అంతర్గత వ్యవస్థను జీవ గడియారం (సిర్కాడియన్ రిథమ్) అని పిలుస్తుంటారు. ఇది 24 గంటలు శరీర విధులను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గడియారం మన నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, హార్మోన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. అయితే, మనం ఈ జీవ గడియారాన్ని సరిగ్గా పాటించనప్పుడు అవి శరీరంలో వివిధ మార్పులకు కారణం అవుతాయని అంటున్నారు. ఫలితంగా మధుమేహం రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
"నిద్రకు డయాబెటిస్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పగటి పూట కన్నా రాత్రి సమయంలో హర్మోన్లు ఎక్కువగా స్రవిస్తుంటాయి. మన శరీరంలో జరిగిన చిన్న నష్టాలను రాత్రి ఇవి పూడుస్తుంటాయి. ఇదొక జీవక్రియ. అయితే, రాత్రి పూట పడుకోకుండా పగటి పూట నిద్రపోవడం వల్ల ఈ జీవక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా రాత్రి పూట శరీరంలో ఎంజైమ్లు, ప్రోటీన్ల ద్వారా జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. దీంతో జీవక్రియ లోపాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఊబకాయం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది."
--డాక్టర్ పీవీ రావు, డయాబెటాలజిస్ట్
రాత్రి నిద్రపోకుండా ఉదయాన్నే షుగర్ టేస్ట్ చేసుకోవద్దట!
ఇంకా నైట్ షిఫ్ట్ చేసి వచ్చి డయాబెటిస్ పరీక్ష చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పరీక్షకు ముందురోజు 8 గంటల నిద్రపోయిన తర్వాతే చేసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి పూట పని చేసి నేరుగా పరీక్ష చేసుకోవడం వల్ల చక్కెర స్థాయులు, ట్రై గ్లెసరాయిడ్లు ఎక్కువగా అవుతాయని వివరిస్తున్నారు. పరీక్ష ఫలితాలు చూసిన డాక్టర్లు మందు మోతాదులు పెంచుతారని.. ఫలితంగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఇంట్లోని ఉండి హాయిగా నిద్ర పోయిన తర్వాత పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇనుప కడాయిలో కూరలు వండుతున్నారా? ఈ సమస్యలు వచ్చే అవకాశమట!
మీకు 6-6-6 వాకింగ్ రూల్ తెలుసా? ఇలా చేస్తే ఫిట్‌గా, అందంగా ఉంటారట! గుండె జబ్బుల ముప్పు తక్కువ!!