Blood in Urine Mean Cancer: మూత్రంలో రక్తం కనిపించగానే క్యాన్సర్ సంకేతమేనని మనలో చాలా మంది భయపడుతుంటారు. అయితే, నిజానికి మూత్రంలో రక్తం కనిపించినంత మాత్రాన అది క్యాన్సరని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం క్యాన్సర్ అనుమానిత సంకేతమేనని తెలుసుకోవాలని అంటున్నారు. మూత్రంలో రక్తం పడడానికి అనేక రకాల కారణాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూత్రంలో రక్తం కనిపించడానికి గల కారణాలు, చేయించుకోవాల్సిన చికిత్స గురించి ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ ఎం. హరికృష్ణ వెల్లడిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రంలో రక్తం కనిపించడానికి కిడ్నీలో రాళ్లతో పాటు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కిడ్నీలోని రాయి జారి పైపులో ఇరుక్కొని పోయినపుడు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చని చెబుతున్నారు. కిడ్నీలో నుంచి రాయి వచ్చి బ్లాడర్‌లోకి రావడంతో కూడా రక్తం వస్తుందని అంటున్నారు. కిడ్నీ నుంచి బ్లాడర్ దాకా ఎక్కడైనా ట్యూమర్ వచ్చినా దానితో కూడా మూత్రంలో రక్తం వస్తుందని వివరిస్తున్నారు. బ్లడ్‌క్లాట్ కాకుండా మందులు వాడేవారు, స్టంట్ వేసుకున్నపుడు కూడా రక్తం వస్తుందని వెల్లడిస్తున్నారు. ఇవే కాకుండా బీట్రూట్ వంటి ఎరుపు రంగు పదార్థాలు తీసుకున్నా, కొన్ని రకాల మందులు వాడినా మూత్రంలో రక్తం పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.
"మూత్రంలో రక్తం పడడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్ నుంచి కిడ్నీలో రాళ్లు, 50 ఏళ్లు దాటిన తర్వాత ఏర్పడే గడ్డలు.. ఇలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత మూత్రంలో రక్తం పడితే జాగ్రత్త పడాలి. మనకు నొప్పి లేకుండా రక్తం పడుతుంటే 30 శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా మూత్రంలో రక్తం పడుతుంటే యూరిన్ టెస్ట్, అల్ట్రా సౌండ్ స్క్రీనింగ్, క్యాట్, సిస్టోస్కోపీ, సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది."
--డాక్టర్ ఎం. హరికృష్ణ, యూరాలజిస్ట్
చికిత్స ఎలా?: ప్రస్తుతం అనేక రకాల వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని నిపుణులు అంటున్నారు. పలు పరీక్షల ద్వారా రక్తం పడడానికి గల కారణాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ వల్ల రక్తం పడుతుంటే యాంటీబయోటిక్స్, కిడ్నీలో రాళ్లుంటే మందులతో నయం చేయవచ్చని వివరిస్తున్నారు. మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంటుందని.. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తిన్న వెంటనే ఆకలి వేస్తుందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?
'ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి'- డైట్లో చేర్చుకోవాలని వైద్యుల సలహా!