తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది! - Vitamin B12 Rich Foods - VITAMIN B12 RICH FOODS

Vitamin B12 Rich Foods : మన శరీరానికి డైలీ తగినమొత్తంలో సూక్ష్మపోషకాలు అందకపోతే బి12 లాంటి విటమిన్ల లోపాలు పెనుశాపంగా మారుతాయి. నిజానికి ప్రస్తుత రోజుల్లో చాలా మందికి బి12 విటమిన్‌ లోపం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో తగిన మొత్తంలో విటమిన్ బి12 పొందేందుకు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

BEST VITAMIN B12 FOODS
Vitamin B12 Rich Foods (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:16 AM IST

These Foods to Prevent Vitamin B12 Deficiency : మన శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మపోషకాల్లో ఒకటి.. విటమిన్ B12. దీనిని 'కోబాలమిన్' అని కూడా పిలుస్తారు. అయితే, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహాయపడే విటమిన్ B12 లోపిస్తే.. అది రక్త హీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్‌ వరకు మనల్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, మనం తీసుకునే డైలీ డైట్​లో ఈ విటమిన్ తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే.. విటమిన్ ​B12(Vitamin B12) పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మాంసాహారం : మాంసాహార పదార్థాలలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, అందులో ముఖ్యంగా కొవ్వు శాతం తక్కువగా ఉండేవి ఎంచుకోవడం మంచిది అంటున్నారు. కాబట్టి, వారానికి కొన్నిసార్లు మీ డైట్​లో మాంసాహారాన్ని చేర్చుకోవడం వల్ల తగిన మొత్తంలో విటమిన్ B12 కంటెంట్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

చేపలు :విటమిన్ B12 సమృద్ధిగా ఉండే మరో పోషకాహారం.. చేపలు. ఇందులో ముఖ్యంగా సాల్మన్ ట్రౌట్ వంటి చేపల్లో ఇది అధికంగా ఉంటుందట. ఈ చేపలలో బి12 మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, వారానికి రెండుసార్లు మీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 స్థాయిలను గణనీయంగా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

2016లో 'Journal of the American Dietetic Association'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 12 వారాల పాటు వారానికి రెండుసార్లు సాల్మన్ చేపలు తిన్న వ్యక్తులలో తినని వారి కంటే వారి రక్తంలో విటమిన్ బి12 స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అలెగ్జాండ్రా వి. ఫ్రాంకో పాల్గొన్నారు. సాల్మన్ చేపలు విటమిన్ బి12 స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని ఆమె పేర్కొన్నారు.

పాల ఉత్పత్తులు :నాన్​వెజ్ తినని వారికీ తగిన మొత్తంలో విటమిన్ B12 పొందడానికి పాల సంబంధిత ఉత్పత్తులు మంచి ఎంపికగా చెబుతున్నారు నిపుణులు. పాలు, జున్ను, పెరుగు అన్నింటిలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుందంటున్నారు. కాబట్టి, మీ రోజువారీ మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల పాల ఉత్పత్తులను చేర్చుకోవడం వలన విటమిన్ B12 లోపం తలెత్తకుండా చూసుకోవచ్చంటున్నారు.

రోజులో ఎంతసేపు కూర్చోవాలో మీకు తెలుసా? - పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

గుడ్లు : విటమిన్ B12 పుష్కలంగా లభించే మరో పోషకాహారం.. గుడ్లు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో ఇది ఎక్కువగా ఉంటుందంటున్నారు. అందుకే కేవలం ఎగ్​ వైట్​నే కాకుండా గుడ్డు మొత్తాన్నీ ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు. రెండు గుడ్ల నుంచి 1.1 మైక్రోగ్రాముల B12 విటమిన్ అందుతుందని చెబుతున్నారు నిపుణులు.

తృణధాన్యాలు :తృణధాన్యాలు బలవర్థకమైన పోషకాలను అందించి అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా నాన్​వెజ్ తినని వారు విటమిన్ బి12 సమృద్ధిగా పొందాలంటే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఒక కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓట్స్‌ ఫ్లేక్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ తీసుకోవటం బెటర్ అంటున్నారు.

పోషకాలున్న ఈస్ట్‌ :దీనిలో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. పోషకాలున్న ఈస్ట్‌ ఒక చెంచాలో 5 ఎమ్‌సీజీ విటమిన్‌ బి12 ఉంటుందని చెబుతున్నారు. ఈ ఈస్ట్‌ను పాప్‌కార్న్‌, గిలకొట్టిన గుడ్లు, సూపులు, పాస్తాలలో కలుపుకుని తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

సోయా పన్నీర్‌ :టోఫుల గురించి విన్నారా! అవునండీ సోయా పాలతో చేసిన టోఫుల్లో విటమిన్ బి12 పుష్కలంగా దొరుకుతుందంటున్నారు నిపుణులు. దీనిని 'బీన్‌ పెరుగు' అని కూడా అంటారు. చపాతీ, అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది. లేదా నూనెలో వేయించి సలాడ్‌లో కూడా కలిపి తీసుకోవచ్చంటున్నారు. ఇలా పైన చెప్పిన వాటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం విటమిన్‌ బి12 సమస్య రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు వచ్చే రోగాల్లో 56 శాతం - కేవలం తిండి ద్వారానే! - ICMR కీలక సూచనలు!

ABOUT THE AUTHOR

...view details