Trump Party Over H1B Visa Issue : వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వర్గంలో చీలికలు మెుదలైయ్యాయి. హెచ్1బీ వీసా విస్తరణపై ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతేకాదు నేతలు సామాజిక మాధ్యమాలు వేదికగా బహిరంగంగా ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే, ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. దీంతో పార్టీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
ఇక్కడే సమస్య మొదలైంది!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈలోగా పలు పదవులకు కొత్తవారిని నియమిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు భారత అమెరికన్లను కీలక పదవులకు అప్పగించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఎంచుకోవడంతోనే సమస్య మెుదలైంది. దీనికి ట్రంప్ వర్గంలోని కొందరు మద్దతుదారులు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
మూర్ఖులను తొలగించాలి: మస్క్
హెచ్1బీ వీసా విషయంలో ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు బాగా పెరుగుతున్నాయి. 'రిపబ్లికన్ పార్టీలోని ధిక్కరించే మూర్ఖులను తొలగించాలి' అని డిమాండ్ చేస్తూ ఎక్స్‌లో ఎలాన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గొడవలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన మస్క్ వాటిని వ్యతిరేకిస్తున్న వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం అద్భుత విజయాలు సాధించాలంటే అందుకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన వారిని నియామించుకోవాల్సి ఉంటుందని మస్క్ చెప్పారు. అమెరికాలోని వందల కంపెనీలు అభివృద్ధి చెందటానికి హెచ్1బీ వీసాదారులే కారణమని ఎక్స్‌లో పోస్టు చేశారు. స్వేచ్ఛ, అవకాశాలకు అమెరికా నిలయమని ఎవరైనా సరే అమెరికాలో వచ్చి పనిచేసుకునే అవకాశం ఉందని మస్క్ వెల్లడించారు. అటు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి సైతం వలసదారుల అంశానికి మద్దతిచ్చారు. అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందని ఆరోపించారు.
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్-మగా
భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన వారిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్-మగాకు మద్దతిస్తున్న నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని వారు వాదిస్తున్నారు. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు. ట్రంప్‌నకు అత్యంత నమ్మకమైన మద్దతుదారులైన లూమర్, ఆన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్జ్ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మస్క్, రామస్వామి అమెరికన్ కార్మికులను అణగదొక్కారని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేత నిక్కీ హేలీ సైతం వివేక్ రామస్వామి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. అమెరికన్లకే మెుదట ప్రాధాన్యత ఇవ్వాలని, అమెరికా సంస్కృతిలో ఎటువంటి లోపం లేదని అన్నారు.