Side Effects of Drinking Beer Daily: పార్టీలు.. పండగలు.. అకేషన్ ఏదైనా, సిచుయేషన్ మరేదైనా ఆల్కాహాల్ ఉండాల్సిందే. బీరు ఉప్పొంగాల్సిందే. అయితే.. బీర్లు అతిగా తాగితే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో పలు మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ డైలీ బీరు తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరగడం పక్కా:డైలీ బీరు తాగడం వల్ల బరువు పెరుగుతారని తద్వారా ఊబకాయం తదితర సమస్యలు వేధిస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. 2015లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ బీరు తాగితే బరువు పెరుగుతారని తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో న్యూ యార్క్ నగరంలోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ఆఫ్ న్యూట్రిషన్ డాక్టర్ డేవిడ్ జె. లూడ్విగ్ పాల్గొన్నారు. ఈ పరిశోధనలో 1,000 మందికి పైగా పురుషులు, మహిళలపై 4 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. బీరులో ఎక్కువగా ఉండే కేలరీల వల్ల బరువు పెరుగుతారని పరిశోధకులు తేల్చారు.
కాలేయానికి ఎఫెక్ట్: మన శరీర అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. అయితే ఎక్కువగా బీరు తాగడం కాలేయం చెడి పోవడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు అంటే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఆల్కహాలిక్ హెపటైటిస్, కాలేయ వాపు వంటి వ్యాధులు వచ్చి.. చివరికి లివర్ పాడయ్యేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బుల ముప్పు:బీరు అధికంగా తాగితే గుండె జబ్బులు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం.. రోజూ బీరు తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయని.. ఇవి హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయని సూచిస్తున్నారు.
నిద్ర కరవు: అతిగా ఏది తీసుకున్నా ప్రమాదమే. అలాగే నిత్యం బీరు తాగితే కంటి నిండా నిద్ర కరవవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ ప్రకారం.. రాత్రి నిద్ర పోయే ముందు బీరు తాగితే సరిగ్గా నిద్ర పట్టదని.. నిద్రకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.