Should I Take Multivitamins Daily:జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. హెల్దీగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. కానీ.. ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మంది మల్టీ విటమిన్స్ తీసుకుంటుంటారు. కొద్దిమంది వైద్యుల సలహా మేరకు వాడుతుంటే.. మరికొద్దిమంది వారి సొంత నిర్ణయాల ప్రకారం డైలీ వేసుకుంటుంటారు. మల్టీ విటమిన్లు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయని భావిస్తారు. మరి, వీటిని డైలీ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏం జరుగుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మల్టీవిటమిన్లు అంటే ఏమిటి?మల్టీ విటమిన్లు అంటే.. విటమిన్లు, ఖనిజాలు, అనేక మూలికలను కలిగి ఉన్న ఆహార పదార్ధాలు. కేవలం ఆహారం ద్వారా తగినంత పరిమాణంలో పోషకాలు అందకపోతే ఇవి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇవి.. మాత్రలు, ద్రవ పదార్థాలు, పౌడర్లు వంటి అనేక రూపాల్లో అందుబాటులో ఉంటాయి.
మల్టీ విటమిన్లు డైలీ తీసుకోవచ్చా?: కొన్ని సందర్భాల్లో మల్టీ విటమిన్లు మేలు చేస్తాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ హోవార్డ్ E. లెవైన్, MD చెబుతున్నారు. తగినంత క్యాలరీలు, ప్రొటీన్లు తీసుకునే చాలా మంది వ్యక్తులు వారి ఆహారం నుంచి తగినంత సూక్ష్మపోషకాలను పొందినప్పటికీ.. MVM(మల్టీవిటమిన్) తీసుకోవడం కొంత మేర ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అంతేకాకుండా డైలీ MVM తీసుకునే వృద్ధులలో అభిజ్ఞా పనితీరు మెరుగుపడినట్లు ఓ అధ్యయనం వెల్లడించినట్లు వివరిస్తున్నారు.
పరిశోధన వివరాలు:2024లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. MVM తీసుకున్న వ్యక్తుల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరులో మెరుగుదల లభించినట్లు కనుగొన్నారు. సుమారు 573 మంది సేకరించిన డేటా ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు.