ICMR Warning Against Nonstick Cookware Usage : నేటి రోజుల్లో చాలా మంది వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా, సులభంగా వంట పని పూర్తిచేసుకోవచ్చని నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే.. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని, నూనె ఉపయోగం తగ్గుతుందని.. ఇలా రకరకాల కారణాలతో నాన్‌స్టిక్ కుక్‌వేర్(Nonstick Cookware Usage) వాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు కూడా వంట చేయడానికి నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే, మీకో బిగ్ అలర్ట్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అలాంటి పాత్రలను ఇకపై వాడొద్దని సూచిస్తోంది. వీటి వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అంతేకాదు.. ఎలాంటి పాత్రలు వాడితే ఆరోగ్యానికి మంచిదో కూడా పలు సూచనలు చేసింది. అసలు, నాన్‌స్టిక్ పాత్రలు ఎందుకు ప్రమాదకరం? వాటికి బదులుగా వేటిని యూజ్ చేస్తే మంచిది? ఐసీఎంఆర్ ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనం యూజ్ చేసే నాన్‌స్టిక్ పాత్రలను 'పాలీ టెట్రాఫ్లోరో ఎథిలిన్'(PTFE) అనే పదార్థంతో తయారుచేస్తారు. ఈ పదార్థాన్నే టెఫ్లాన్ అని కూడా పిలుస్తారు. కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో టెఫ్లాన్ అనే సింథటిక్ రసాయన పదార్థం తయారవుతుంది. దీన్ని అడుగు భాగాన పోతగా పోసి నాన్‌స్టిక్ పాత్రలను రూపొందిస్తారంటున్నారు నిపుణులు. ఆ విధంగా తయారుచేసిన నాన్‌స్టిక్ కుక్‌వేర్‌పై.. ఏ చిన్న గీత పడినా టెఫ్లాన్ కోటింగ్ నుంచి విష వాయువులు, హానికారక కెమికల్స్ వెలువడి మనం తినే ఆహారంలో కలుస్తాయని చెబుతుంది ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్. కనీసం ఒక్క గీత నుంచి 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు రిలీజ్ అవుతాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
నాన్ స్టిక్ పాత్రల్లో ఇవి వండకూడదు! - వండితే ఏమవుతుందో తెలుసా?