Rythu Bharosa To Podu Lands Farmers : అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పట్టాలు పొందిన పోడు భూములకూ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా విధివిధానాలపై ఆదివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మార్గదర్శకాలు విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రైతులకు పెట్టుబడిసాయం : రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు, అవసరం అయిన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు తోడ్పడుతుందన్నారు. రైతు భరోసా పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను వివరించారు.
- రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలకు పెంచనున్నారు.
- భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం, వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించడం జరుగుతుంది.
- ఆర్‌బీఐ నిర్వహించే ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో సాయం రైతుల ఖాతాలో జమ
- వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో పథకం అమలు. దీనికి ఎన్‌ఐసీ హైదరాబాద్ ఐటీ భాగస్వామి
- కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించి పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా వ్యవహరిస్తారు
సాగు భూములకే రైతు భరోసా : రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకొని పరిశీలించింది. దాదాపు 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీటిని ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలనుకుంటుంది. ఆ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం, 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇక నుంచి సాగు చేయలేని భూములకు రైతు భరోసా వేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ