SBI Report On Female Voters In India : అక్షరాస్యతతోనే సామాజిక మార్పు సాధ్యం. ఇదే నిజం. దీనివల్ల మన దేశంలో ఓటింగ్ సరళిలోనూ పెను మార్పు వచ్చిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకించి మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని నివేదికలో ప్రస్తావించారు. మనదేశంలో ఒకే ఒక్క శాతం అక్షరాస్యత పెరిగిన పర్యవసానంగా ఎన్నికల్లో మహిళల ఓటింగ్ 25 శాతం దాకా పెరిగిందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో అదనంగా 1.8 కోట్ల మంది మహిళలు ఓట్లు వేశారని తెలిపింది. వీరిలో దాదాపు 45 లక్షల మంది మహిళలు ఓటుహక్కును వినియోగించుకోవడానికి మూలకారణం అక్షరాస్యతేనని పేర్కొంది. అక్షరాస్యతతో పాటు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఇంటి యజమానిగా ఉండటం అనేది మహిళలకు ఓటువేసే దిశగా చైతన్యాన్ని అందించాయని ఎస్‌బీఐ నివేదికలో పొందుపరిచారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావం
'ప్రధానమంత్రి ముద్రా యోజన' పథకం అత్యధిక సంఖ్యలో మహిళలను ఆకట్టుకుందని, దీని ప్రభావంతో 2024 ఎన్నికల్లో అదనంగా 36 లక్షల మంది మహిళలు ఓట్లు వేశారని వెల్లడించింది. పారిశుద్ధ్య నిర్వహణ అంశం మహిళల దృష్టిలో చాలా ముఖ్యమైంది. పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాల ప్రభావంతో 2024 ఎన్నికల్లో అదనంగా 21 లక్షల మంది మహిళలు ఓట్లు వేశారని నివేదిక తెలిపింది. విద్యుత్, తాగునీటి సరఫరాలకు సంబంధించిన సౌకర్యాల కల్పన అంశాన్ని కూడా మహిళలు కీలకంగా పరిగణించారు. వాటిని సాధించుకునే లక్ష్యంతో ఓట్లు వేసేందుకు కదం తొక్కారు.
మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినప్పటికీ, ప్రభావవంతమైన వర్గంగా వారు రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోలేకపోయారని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించే ఇళ్లకు యజమానిగా మహిళలనే చేశారు. ఈ అంశం 2024 ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకుంది. దీనివల్ల 20 లక్షల మంది మహిళలు అదనంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్‌బీఐ అంచనా వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మంజూరైన ఇళ్లలో దాదాపు 74 శాతం నివాసాలకు మహిళలు ఒంటరిగా లేదా భర్తతో కలిసి ఉమ్మడిగా ఇంటి యజమానులు అయ్యారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా
'మహిళల ఓటింగ్ శాతం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నమోదైంది. ఒక్కో విధమైన స్థాయిల్లో అక్షరాస్యత, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పారిశుద్ధ్య సౌకర్యాల విషయంలోనూ కొన్ని రాష్ట్రాలు ఇంకా వెనుకంజలోనే ఉన్నాయి. అందుకే మహిళల ఓటింగ్ సరళి రాష్ట్రాలను బట్టి మారిపోయింది. దీంతోపాటు వివిధ వయసులకు చెందిన మహిళల ఓటింగ్ శాతంలో 62 శాతం దాకా తేడాను గుర్తించాం' అని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. అక్షరాస్యత, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారతా పథకాల ద్వారా రానున్న కాలంలో మహిళల ఓటింగ్ శాతాన్ని మరింత పెంచొచ్చనే సందేశాన్ని ఈ నివేదిక ఇచ్చింది.