Bhumi Amla Benefits :ఉసిరి తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ, నేల ఉసిరి(భూమి ఆమ్లా) గురించి మీలో ఎవరికైనా తెలుసా? దాన్ని తినడం వల్ల లివర్ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చని ఎంత మందికి తెలుసు. మిగతా ఉసిరి కాయల్లా కాకుండా నేలకు అతి దగ్గరగా పెరిగే నేల ఉసిరి చాలా డిఫరెంట్. సైజులో చిన్న చిన్నగా ఉండే ఈ కాయలు జ్యూసీగా ఉండి, టేస్టీగా అనిపించకపోయినా కాలేయం మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తాయట. ఈ శక్తివంతమైన ఫ్రూట్‌ను తిని మీ కాలేయాన్ని కాపాడుకోమని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
నేల ఉసిరితో పాటు పునర్నవ (గలిజేరు) ఆకులు, వేప ఆకులు కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు దూరమవుతాయి. కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ అద్భుతంగా పని చేస్తుంది. కాకపోతే వీటిని తీసుకునే ముందు అనుభవమున్న వైద్య నిపుణుడి సలహా తీసుకుని తగిన మొత్తంలో మాత్రమే తీసుకోవాలి.
ఈ నేల ఉసిరికి మరోపేరే ఫిల్లాంతస్ నీరూరి. "దీనితో చేసిన ఔషదాన్ని బెస్ట్ లివర్ టానిక్ అని చెప్పుకోవచ్చు. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పనితీరును కూడా వృద్ధి చేస్తుంది. కామెర్లు లాంటి సమస్యల్లో ఉన్నప్పుడు దీని సహయంతోనే చికిత్స అందిస్తారు. ఈ కాయ వినియోగంతో అద్భుతమైన ఫలితాలు కూడా పొందొచ్చు" అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇందులో విటమిన్ సీ అత్యున్నత స్థాయిలో ఉండటం వల్ల శరీరాన్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచుతాయి. లివర్ సమస్యలను తగ్గించడంలో, జ్వరానికి, కామెర్లకు మంచి ఔషదంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీ బయోటిక్, యాంటీ ఆస్తమాటిక్ గుణాలు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. ఫలితంగా జలుబు, గొంతు నొప్పి, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు దరి చేరవు. అలా ఛాతీ, నాసికా కుహాలకు ఉపశమనాన్ని కలిగించి శ్వాస క్రియ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. వీటితో పాటుగా చర్మ సమస్యలు రాకుండా చేసి చర్మారోగ్యాన్ని వృద్ధి చేస్తాయి.