Health Benefits Of Black Plums :వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్య ఔషధాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. అందుకే.. అవి విరివిగా దొరికే రోజుల్లో అస్సలు మిస్ అవ్వొద్దంటున్నారు నిపుణులు. మరి.. నేరేడు పండ్లు(Black Plums)తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచతుతాయి : నేరేడు పండ్లు చూడటానికి చక్కని రంగుతో.. మిలమిలా మెరిసిపోతూ ఎంత రుచిగా ఉంటాయో.. అదే స్థాయిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నేరేడులో పుష్కలంగా ఉండే ఫైటో కెమికల్స్, పాలీఫినాలిక్ ఆమ్లాలు, విటమిన్ సితో ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
ఇన్ఫెక్షన్లకి చెక్ : వానాకాలంలో ఎక్కువగా వచ్చే అతిసారం, కలరా వ్యాధులతోబాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ నేరేడు అరికడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే.. సి-విటమిన్ అధికంగా ఉండటంవల్ల దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులకీ నేరేడు మంచి మందుగా పనిచేస్తుందంటున్నారు. క్రమం తప్పక తింటే కోరింత దగ్గు, టీబీ వంటివీ తగ్గుతాయట.
2023లో 'ఫిట్టోథెరపీ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నేరేడు పండులోని పాలీఫినాలిక్ ఆమ్లాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని తేలింది. ఈ పరిశోధనలో దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. నేరుడు పళ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలు బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకుని వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయని ఆయన పేర్కొన్నారు.
జీర్ణక్రియ మెరుగు :ఈ పండ్లు తినడం ద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. అలాగే అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు.
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు!