How to Identify Best Watermelon :ఎండకాలం వచ్చిదంటే.. కనీసం ఒక్కసారైనా పుచ్చకాయ తింటారు అందరూ. అంత ఫేమస్ అయిన ఈ కాయ సరిగా పండిందా లేదా? అన్నది మాత్రం బయట నుంచి చూసి గుర్తుపట్టడం అందరికీ సాధ్యం కాదు. ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
పుచ్చకాయ రంగు :పుచ్చకాయ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపించే సరికి.. తాజాగా ఉందని చాలా మంది కొనేస్తూ ఉంటారు. తీరా ఇంటికెళ్లాక చూస్తే కాయ పూర్తిగా పండకపోవటం, చప్పగా ఉండటం, గుజ్జు తక్కువగా ఉండటం గమనిస్తుంటారు. వాస్తవానికి పూర్తిగా పండిన పుచ్చకాయ.. ఎప్పుడూ ముదురు రంగులోనే ఉంటుంది. కాబట్టి పైకి కనిపించటానికి తాజాగా ఉందా లేదా అన్న విషయం పక్కనపెట్టి ముదురు వర్ణంలో ఉన్న కాయను ఎంపిక చేసుకోండి.
కొన్ని పుచ్చకాయల్లో ఒకవైపు తెలుపు రంగు లేదంటే గోధుమ రంగు మచ్చలుంటాయి. పండించేటప్పుడు పుచ్చకాయలు నేలకు ఆనుకుని ఉండటం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే అవి అంత మంచివన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గోధుమ రంగు మచ్చలున్న పుచ్చకాయల్ని అనుమానం లేకుండా కొనొచ్చు. అంతేకాదు కొన్ని పుచ్చకాయలపై సాలెగూడులాగా, గోధుమ రంగులో గీతలుంటాయి. తెగులు సోకింది కావొచ్చని.. ఆ కాయలను కొనేందుకు ఇష్టపడరు. వాస్తవానికి ఇంతకంటే తీపి కాయ మరొకటి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తేనెటీగలు అనేకసార్లు ఆ పూల మీద వాలడం వల్ల ఆ మచ్చలు ఏర్పడతాయి.
పుచ్చకాయను లైట్‌గా కొట్టండి :కొంత మంది పుచ్చకాయను కొనేటప్పుడు చేతితో కాయపై రెండు మూడు సార్లు కొట్టి తీసుకోవడం చూస్తుంటాం. అయితే, ఇలా ఎందుకు కొడతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? బాగా పండి స్వీట్‌గా ఉండే పుచ్చకాయను చేతితో కొట్టినప్పుడు శబ్ధం వస్తుంది. అలాగే పండకుండా గుజ్జు లేకుండా ఉండేవాటిని కొట్టినప్పుడు తక్కువ సౌండ్ వస్తుంది.