How Many Hours Sleep Do You Need?:మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన పోషకాహారం ఎంత అవసరమో.. రోజూ తగినంత నిద్ర కూడా అంతే అవసరం. అలాగే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నా.. ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ పనులు, నైట్ షిప్ట్స్, కుటుంబ బాధ్యతలు, ఒత్తిడి.. ఇలా కారణాలేవైనా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి సరైన నిద్రలేకపోతే పిల్లలకైనా, పెద్దలకైనా ఆరోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ నిద్రలేమి దీర్ఘకాలంగా కొనసాగితే గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్, ఊబకాయం, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా.. సరైన నిద్రలేకపోతే ఒత్తిడి, ఆకలి, జీవక్రియలను నియంత్రించే హార్మోన్లు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ డైలీ తగినంత నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిద్ర సమయం వయసును బట్టి అవసరం ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో.. వయసు ఆధారంగా ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలనేది వివరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
- నవజాత శిశువులు (0-3 నెలలు):నవజాత శిశువులకు సాధారణంగా రోజుకు దాదాపు 14-17 గంటల నిద్ర అవసరం.
- 4-11 నెలలు ఉన్న శిశువులు : వీరు రోజుకు 12-15 గంటలపాటు నిద్ర పోవడం అవసరం.
- 1-2 ఏళ్లు ఉన్న చిన్నారులు : వీరు ఆరోగ్యంగా ఉండడానికి రోజుకు సుమారు 11-14 గంటల నిద్ర అవసరం.
- 3-5 సంవత్సరాలు ఉన్న పిల్లలు : ఈ చిన్నారులకు తగినంత విశ్రాంతి అవసరం. వీరికి రోజూ 10-13 గంటల నిద్ర అవసరం.
- 6-12 సంవత్సరాలు ఉన్న పిల్లలు :పాఠశాలకు వెళ్లే వయసు ఉన్న ఈ పిల్లల నిద్ర వ్యవధి రోజూ 9-12 గంటలుగా ఉండాలి.
- 13-18 ఏళ్లు ఉన్నవారు(టీనేజర్లు): వీరు రోజుకు 8-10 గంటలు నిద్రపోవడం అవసరం.
- 18-60 ఏళ్లు ఉన్నవారు : ఈ వయసు వారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7-9 గంటలు నిద్ర పోవాలి.
- 60 సంవత్సరాలు పైబడినవారు :ఈ వయసు వారిలో కొన్ని శరీర ప్రక్రియలు నెమ్మదిస్తాయి. చాలా మంది వృద్ధులు కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. అలాకాకుండా ఉండాలంటే వీరికి డైలీ 7-8 గంటలు నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.