Health Benefits of Beerakaya: బీరకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూర, పచ్చడి అంటూ రకరకాలుగా వండుకుని తింటుంటారు. అంతే కాదు నీటి శాతం అధికంగా లభించే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. అలాగే బీరకాయను ఎవరైనా తినవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. బీరకాయ తింటే ఈజీగా ఆహారం జీర్ణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బీరకాయను ఈ మండే ఎండల్లో తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీరకాయను సమ్మర్‌లో తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. వాటిల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం..
డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది:బీరకాయలో 92శాతం నీరు ఉంటుంది. వేసవి కాలంలో బీరకాయ తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా బీరకాయలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి బీరకాయ తింటే.. శరీరంలో హీట్ తగ్గి చల్లగా రీఫ్రెష్‌గా ఉంటుంది. రోజంతా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. అలాగే బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ద్రవాలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 2013లో "జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బీరకాయ తిన్న వారిలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు.
బరువు నియంత్రణలో ఉంటుంది:బీరకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బీరకాయలో కేలరీలు తక్కువగా ఉండి నీరు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు తినకుండా ఉండేలా చేస్తాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.
డయాబెటిస్‌ను నియంత్రించడంలో: షుగర్ వ్యాధితో బాధపడేవారికి బీరకాయ తినడం వల్ల ప్రయోజనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బీరకాయలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17% నుంచి 21% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్ ఆఫ్ ఎపిడెమియాలజీ చెందిన డా. సిమోన్ డి. విల్లియమ్స్ పాల్గొన్నారు. అధిక మెగ్నీషియం ఆహారం తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది:బీరకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం శరీరం నుంచి సోడియంను విసర్జించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.