New Ration Cards Issued In Telangana : తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేడు కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు.
అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేరిక : రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు. తొలిరోజు మండలానికొక గ్రామంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లను చేర్చారు.
రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం : గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తోంది : గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన, గ్రామాలకు అధికారులను ఇళ్లకు పంపిస్తున్నామని వివరించారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లుగా వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులను తీసుకుంటుందని ఆయన వివరించారు.
వాటికే ఎక్కువ దరఖాస్తులు : గ్రామ సభలు, వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసం వచ్చినవే అధికంగా ఉన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వీటి కోసమే చాలా మంది లబ్ధిదారులు అర్జీలు పెట్టుకున్నారు. అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. అక్కడకక్కడ గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల : 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటిరోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల చేశారు.
రేషన్ కార్డుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరు - ఆశ్చర్యపోతున్న స్థానికులు