Easy Exercises For Improve Eye Vision :నేటి డిజిటల్ యుగంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కారణంగా చాలా మంది వివిధ కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కొన్ని వ్యాయామాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పామింగ్ :కళ్లకు సంబంధించిన ఈ సులభమైన వ్యాయామం కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండే నేలపై కూర్చొని మీ కళ్లు మూసుకుని నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అలాగే ఆ టైమ్లో మీ అరచేతులు వెచ్చగా మారేలా వాటిని గట్టిగా రుద్ది.. మీ మూసిన కనురెప్పల మీద సున్నితంగా ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చేతుల వెచ్చదనాన్ని కళ్లు గ్రహించి.. కంటి కండరాలకు మంచి విశ్రాంతిని కలిగిస్తాయట. ఈ ప్రక్రియను 5 నుంచి 10 నిమిషాల పాటు రిపీట్ చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
ఐ రోల్ : ఇది కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా నేలపై కూర్చొని వెన్నముకను నిటారుగా ఉంచాలి. ఆపై మీ చేతులను ఒడిలో ఉంచి, తలను కదలకుండా 10-15 సెకన్ల పాటు మొదట సవ్యదిశలో వృత్తాకార కదలికలో మీ కళ్లను నెమ్మదిగా తిప్పండి. ఆపై మరో 10-15 సెకన్ల పాటు అపసవ్య దిశలో తిప్పండి. అలాగే మీ కళ్లను రిఫ్రెష్ చేయడానికి కొన్ని సార్లు బ్లింక్ చేయండి. ఇలా ఈ ప్రక్రియను 5 నుంచి 10 నిమిషాల పాటు పునరావృతం చేయండి. ఫలితంగా ఈ మీ కంటి కండరాలకు మంచి వ్యాయామం లభించి కళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో కంటిచూపు మెరుగుపడుతుందంటున్నారు.
డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!
రెప్పలు వేయడం :ఈ సులభమైన వ్యాయామం కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి డిజిటల్ స్క్రీన్లను ఉపయోగిస్తున్నప్పుడు, ఎక్కువసేపు ఏదైనా వస్తువుపై దృష్టి కేంద్రీకరించే సమయంలో ప్రతి కొన్ని సెకన్లకు కళ్లను బ్లింక్ చేయాలంటున్నారు. రెప్పలు వేయడం వల్ల కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. అలాగే.. పొడిబారకుండా చేస్తుంది. కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.