Colon Cancer Causes Food:ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్సర్లకు మారుతున్న ఆహార అలవాట్లే కారణమవుతునట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది. దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్‌కు ఇది తోడు కావడం వల్ల ఈ వ్యాధి తీవ్రమవుతుందని వెల్లడించింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలతో కూడిన వెస్ట్రన్ డైట్, దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్.. కణితి వృద్ధికి కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకర ఆహారంతో పరిస్థితిని చక్కదిద్దే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఈ పద్ధతిలో ఇన్‌ఫ్లమేషన్‌ను, తద్వారా పెద్దపేగు క్యాన్సర్‌ను నియంత్రించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో పెద్దపేగు క్యాన్సర్ మూడోస్థానంలో ఉంది. అన్ని క్యాన్సర్ కేసుల్లో దీని వాటా 10 శాతంగా ఉందని.. క్యాన్సర్ సంబంధ మరణాల్లో ఇది రెండో స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, చాలాకేసుల్లో దీన్ని ముదిరిపోయిన దశలోనే గుర్తిస్తున్నారు. ఫలితంగా ఆ స్థితిలో చికిత్సకు అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ రుగ్మతపై వెస్ట్రన్ డైట్ ప్రభావం గురించి How ultra-processed foods may drive colorectal cancer riskఅంశంపై వీరు లోతైన పరిశోధన చేపట్టారు.
ఏమిటీ డైట్?
ఈ వెస్ట్రన్ డైట్‌లో భారీగా చక్కెరలు, అల్ట్రాప్రాసెస్డ్ తినుబండారాలు, సంతృప్త కొవ్వులు, రసాయనాలు, ఇన్‌ఫ్లమేషన్ కలిగించే విత్తన నూనెలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకునేవారి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అధ్యయనంలో వెల్లడైందని వెల్లడించారు. ఈ ఇన్‌ఫ్లమేషన్ పెద్దపేగు కణుతుల్లో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ అనేది దీర్ఘకాల గాయం లాంటిదని, ఒక పట్టాన నయం కాదని వివరిస్తున్నారు. నిత్యం అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారంతో వెస్ట్రన్ డైట్ ఎక్కువగా తీసుకుంటుంటే.. ఆ గాయంలో నయమయ్యే గుణం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్ పెరగడం, రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల అంతిమంగా క్యాన్సర్ వృద్ధి చెందుతుందని అంటున్నారు.
అవకాడో తదితరాల్లో ఉండే ఆరోగ్యకర కొవ్వుల ద్వారా లభ్యమయ్యే బయోయాక్టివ్ లిపిడ్ పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి సాయంతో మన శరీరం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించుకుంటుందని వివరిస్తున్నారు. ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లోనూ ఇలాంటివి ఉంటాయని.. ఇవి మాత్రం శరీరానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే.. రోగనిరోధక వ్యవస్థలో సమతౌల్యత దెబ్బతిని దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్ ఉత్పన్నమవుతుందని అంటున్నారు.